
Akhil – Naga Chaitanya : ఒక ఫ్యామిలీకి చెందిన హీరోలందరికీ కామన్ ఫ్యాన్స్ ఉంటారు. అలాగే ఫ్యామిలీ హీరోలు మల్టీస్టారర్స్ చేస్తే ఆ హైప్ వేరుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్-రామ్ చరణ్, బాలకృష్ణ-ఎన్టీఆర్, చిరంజీవి-పవన్ కళ్యాణ్ వంటి క్రేజీ మల్టీస్టారర్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ ఎక్కడో ఉంది. అక్కినేని హీరోలు చాలా ఈజీగా ఫ్యామిలీ మల్టీస్టారర్స్ చేస్తారు. ఈ ట్రెండ్ ఏఎన్నార్, నాగార్జున నుండి వస్తుంది. వీరిద్దరూ పలు చిత్రాల్లో కలిసి నటించారు. ఇక ‘మనం’ గొప్ప మల్టీస్టారర్ గా పేరు తెచ్చుకుంది.
మనం మూవీలో అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటించారు. ఏఎన్నార్, నాగార్జున, నాగ చైతన్యల ఈ మల్టీస్టారర్ అద్భుతం చేసింది. ఇది ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ కావడం మరో విశేషం. అక్కినేని అఖిల్ కూడా మనం మూవీలో తళుక్కున మెరిశాడు. కాబట్టి అక్కినేని హీరోలు అందరూ కలిసి నటించిన సినిమాగా మనం ఉంది. బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయాలని పలువురు నిర్మాతలు భావించారు.
నాన్న ఏఎన్నార్ చివరి చిత్రం, అరుదైన జ్ఞాపకం కావడంతో నాగార్జున మనం రీమేక్ రైట్స్ ఎవరికీ అమ్మలేదు. ఇక నాగ చైతన్య, నాగార్జున కలిసి ఇటీవల ఓ మల్టీస్టారర్ చేశారు. బంగార్రాజు మూవీలో వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే అన్నదమ్ములైన నాగ చైతన్య-అఖిల్ కలిసి మల్టీస్టారర్ చేయాలనేది అభిమానుల కోరిక. దీనిపై అఖిల్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
ఏజెంట్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న అఖిల్ మాట్లాడుతూ… ఇతర హీరోలతో మల్టీస్టారర్ చేస్తే పెద్దగా సమస్య ఉండదు. కానీ అన్నదమ్ములు మల్టీస్టారర్ చేయడం భిన్నమైన వ్యవహారం. ఇద్దరికీ మంచి పాత్రలు లభించాలి. స్క్రిప్ట్ కుదరాలి. అప్పుడే ఆ మల్టీస్టారర్ సెట్ అవుతుంది. మా ఇద్దరికీ సెట్ అయ్యే కథ దొరికితే కచ్చితంగా మల్టీస్టారర్ చేస్తాము… అన్నారు. కాగా ఆయన స్పై గా నటించిన ఏజెంట్ ఏప్రిల్ 28న విడుదల కానుంది. సురేందర్ రెడ్డి ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు.