Mukhachitram Movie Review: నటీనటులు: వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్య రావు, ఆయేషా ఖాన్, విశ్వక్ సేన్.
కథ, స్క్రీన్ ప్లే: సందీప్ రాజ్.
దర్శకత్వం: గంగాధర్
నిర్మాతలు: ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల
సంగీతం: కాలభైరవ
ఎడిటింగ్: పవన్ కళ్యాణ్

మరో కొద్ది రోజుల్లో ఏడాది ముగుస్తుంది. పైగా పెద్ద సినిమాలు కూడా లేవు.. దీంతో ఇన్నాళ్లు విడుదలకు నోచుకోని చిన్న సినిమాలు ఒకదాని వెంట ఒకటి విడుదలవుతున్నాయి. తాజాగా శుక్రవారం ఒకేసారి 17 సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఇందులో బజ్ ఉన్నవి కొన్నే. అలా బజ్ క్రియేట్ చేసిన వాటిల్లో “ముఖ చిత్రం” అనే సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ట్రెయిలర్ ప్రామిసింగ్ గా అనిపించింది. పైగా ఈ సినిమాకి కలర్ ఫొటో సినిమా తో జాతీయస్థాయి పురస్కారం అందుకున్న సందీప్ రాజ్ కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. సినిమా బండి చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వికాస్ వశిష్ట ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు.
కథ
రాజ్ కుమార్( వికాస్ వశిష్ట) పేరొందిన ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్. మహతి( ప్రియా వడ్లమాని) సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి. పెళ్ళిళ్ళ బ్రోకర్ నుంచి మహతి ఫొటో రాజ్ కుమార్ కు వస్తుంది. ఆ ఫొటో చూసిన రాజ్ కుమార్ ఆమెనే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.. పెళ్లిచూపుల కోసం విజయవాడ వస్తాడు. మహతికి కూడా రాజ్ కుమార్ నచ్చేస్తాడు. పెద్దల సమక్షంలో ఇద్దరికీ వివాహం జరుగుతుంది. ఇలా సాగుతుండగానే ఒకరోజు రాజ్ కుమార్ స్నేహితురాలు మాయ(అయేషా ఖాన్) రోడ్డు ప్రమాదానికి గురవుతుంది.. ఈ ఘటనలో ఆమె ముఖం తీవ్రంగా గాయపడుతుంది. ఈ ఘటన జరిగిన తర్వాత రోజే మహతి మెట్లపై నుంచి కిందపడి చనిపోతుంది. అయితే మహతి మొహన్ని మాయకు రాజ్ కుమార్ ట్రాన్స్ ప్లాంట్ చేస్తాడు. దీని తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి? అసలు మహతి అలా అకస్మాత్తుగా ఎలా చనిపోయింది? అది సహజ మరణమా? లేకుంటే ఎవరైనా హత్య చేశారా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
నేపథ్యం
కోవిడ్ తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు.. అయితే ఈ సినిమా కథ చెప్పేందుకు బాగానే ఉన్నా. . దాన్ని తీయడంలో కొంత ఇబ్బంది ఎదురయింది. ఒక సామాజిక సమస్యను దర్శకుడు కోర్టు డ్రామాగా మలిచే ప్రయత్నం చేశాడు. అయితే అదే విషయంలో తడబ డ్డాడు.. సినిమా మొదటి భాగంలో పాత్రల పరిచయం, పెళ్లిచూపులు, పెళ్లి ఇవన్నీ కాస్త సాగదీతగా అనిపిస్తాయి. వీటికి కత్తెర పెట్టి అసలు పాయింట్ లోకి వెళ్ళి ఉంటే బాగుండేది. మాయ రోడ్డు ప్రమాదానికి గురి కావడం, మహతి అనుకోకుండా చనిపోవడం… కథలో మలుపులకు కారణమవుతాయి. అయితే వీటిని అంత బలంగా చెప్పడంలో దర్శకుడు విఫల మయ్యాడు. ఇక సెకండ్ ఆఫ్ లో అసలు కథ మొదలవుతుంది.. మహతి చావుకి కారణం తెలిసిన తర్వాత కథలో సంరక్షణ మొదలవుతుంది. ఆ తర్వాత కోర్టు డ్రామా డిజైన్ చేశారు. అయితే ఇక్కడ లాయర్ గా విశ్వక్ సేన్ కనిపిస్తాడు. అయితే ఈ డ్రామాను దర్శకుడు ప్రేక్షకులు అనుకున్నంత స్థాయిలో బలంగా రాసుకోలేదు.. సిసి కెమెరాలో దృశ్యాలు రికార్డ్ చేసి వాటిని ఆధారాలుగా చూపడం, న్యాయవాదుల వాదనలు సాదా సీదాగా ఉన్నాయి. అయితే విశ్వక్సేన్ స్క్రీన్ ప్రజెన్స్ తో కోర్టు డ్రామా ఆసక్తికరంగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ప్రేక్షకులు ఊహించినట్టే ఉంటుంది.

ఎవరు ఎలా చేశారంటే
వికాస్ మరోసారి ఆకట్టుకున్నాడు . రాజకుమార్ పాత్ర కేక్ వాక్ లాగా చేసుకుంటూ వెళ్ళాడు. మహతి పాత్రలో ప్రియా వడ్లమాని అందంగా ఉంది. మాయ గా నటించిన ఆయేషా ఖాన్ ప్రేక్షకులను మెప్పిస్తుంది.. విశ్వక్ చేసింది చిన్న పాత్రయినప్పటికీ ప్రేక్షకులను అలరిస్తుంది. లాయర్ గా నటించిన రవి శంకర్ పాత్ర ఆకట్టుకుంటుంది. మీర్, చైతన్య, సునీల్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక పరంగా
ఈ సినిమాకు బడ్జెట్ పరిమితుల కారణంగా సాంకేతికంగా ఓకే ఓకే అనిపిస్తుంది.. పాటలు పెద్దగా గుర్తుండవు. సెకండ్ ఆఫ్ లో విశ్వక్ చెప్పిన డైలాగులు అలరిస్తాయి. సామాజిక సమస్యను థ్రిల్లర్ కోణం లో చూపాలనుకున్న ప్రయత్నం బాగున్నప్పటికీ… దాన్ని తీసిన విధానం అంతగా కనెక్ట్ కాలేదు.. ఒక మిస్టరీ చావుని కోర్టు రూమ్ డ్రామాకు కనెక్ట్ చేసి సామాజిక సమస్యను చర్చించడం అంతగా ఆసక్తి అనిపించదు.
ప్లస్ పాయింట్లు
నటీనటులు, కథ, కథా నేపథ్యం, మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు.
మైనస్ పాయింట్లు
డ్రామా రక్తి కట్టకపోవడం
థ్రిల్లర్ కు, సామాజిక నేపథ్యానికి లంకే కుదరకపోవడం
రొటీన్ ముగింపు
ఆకట్టుకోని సంగీతం.
రేటింగ్: 2.5/5
బాటమ్ లైన్: కొంతమేర మాత్రమే ఆకట్టుకునే ముఖచిత్రం