Mufasa The Lion King : మన టాలీవుడ్ లో కూడా కొన్ని హాలీవుడ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఉదాహరణకు మార్వెల్ స్టూడియోస్ నుండి విడుదలైన సూపర్ హీరో సినిమాలు మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టిస్తూ వచ్చాయో మన చిన్న తనం నుండి చూస్తూ వచ్చాము. అదే విధంగా జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన టైటానిక్, అవతార్ సిరీస్ లు మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. వాటితో పాటు 2019 వ సంవత్సరం లో విడుదలైన లైవ్ యానిమేషన్ చిత్రం ‘ది లయన్ కింగ్’ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తం 1.6 బిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 250 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపుగా 20 కోట్ల రూపాయిల గ్రాస్ చేసింది.
అప్పట్లో మన తెలుగు వెర్షన్ కి న్యాచురల్ స్టార్ నాని హీరో క్యారక్టర్ కి వాయిస్ ఓవర్ అందించాడు. ఆయన వాయిస్ ఓవర్ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ఇకపోతే ఆ సినిమాకి సీక్వెల్ గా ‘ముఫాసా : ది లయన్ కింగ్’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై పర్వాలేదు అనే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది. తెలుగు వెర్షన్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఈ చిత్రానికి క్రేజ్ మన రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగింది. మహేష్ ని వెండితెర మీద మరో మూడేళ్ళ పాటు చూసే అవకాశం లేనందున, ఆయన అభిమానులు ఈ సినిమా విడుదలకి భారీ స్థాయిలో సెలెబ్రేషన్స్ చేసుకోవాలని అనుకున్నారు.
ప్లానింగ్ కి తగ్గట్టుగానే ఈ సినిమాకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే సుదర్శన్ థియేటర్ లో మహేష్ ఫ్యాన్స్ అదిరిపోయే రేంజ్ లో సెలెబ్రేషన్స్ చేసారు. బాణాసంచాలు, కేక్ కట్టింగ్స్ మధ్య ఎంతో ఉత్సాహం గా స్పెషల్ షో ని ఎంజాయ్ చేసారు. కేవలం హైదేరాబద్ లో మాత్రమే కాదు వైజాగ్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఈ సినిమాకి మహేష్ ఫ్యాన్స్ స్పెషల్ షోస్ ని ఏర్పాటు చేసి మంచిగా ఎంజాయ్ చేసారు. అయితే స్పెషల్ షోస్ కి బాగానే వసూళ్లు వచ్చాయి కానీ, ఓవరాల్ తెలుగు స్టేట్స్ గ్రాస్ వసూళ్లు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. కనీసం 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు. ప్రధాన నగరాల్లో కూడా వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. హిందీ వెర్షన్ వసూళ్లు మాత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నాయి. ఓవరాల్ గా మొదటి రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.