Mowgli Movie Review: రివ్యూ: మోగ్లి 2025
నటీనటులు: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ బండి సరోజ్ కుమార్, వైవా హర్ష తదితరులు.
సంగీతం: కాల భైరవ
ఛాయాగ్రహణం: రామ మారుతి
దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్
సుమ – రాజీవ్ కనకాల తనయుడు రోషన్ బబుల్ గమ్ సినిమాతో హీరోగా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాడు. తాజాగా ‘మోగ్లీ’ అనే సినిమాతో రోషన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కలర్ ఫోటో సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద సంస్థ నిర్మించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కొంత మేరకు ఆసక్తి నెలకొంది. ఈ మోగ్లీ ఆడియన్స్ ను మెప్పించిందా లేదా అనేది రివ్యూ లో చూద్దాం.
ఈ మోగ్లీ కథ ప్రధానంగా పార్వతీపురం అనే ఊరిలో జరుగుతుంది. మురళికృష్ణ(రోషన్) తల్లిదండ్రులు చనిపోవడంతో అనాధ అవుతాడు. ఈ మురళికృష్ణనే అందరూ మోగ్లీ అని పిలుస్తుంటారు. అంతేకానీ జంగిల్ బుక్ మోగ్లీతో ఇతనికి ఎలాంటి చుట్టరికమూ లేదు. మన మోగ్లీ ధ్యేయం ఒకటే.. అదేంటంటే తన తండ్రిలాగా పోలీసు కావడం. ఇదిలా ఉంటే మోగ్లీ ఉంటున్న ఊరికి ఒక సినిమా యూనిట్ వస్తుంది. అదే యూనిట్ లో మెంబర్ అయిన జాస్మిన్ ఒక బధిరురాలు. ఈ సినిమాలోనే డూప్ గా పనిచేయడానికి వెళ్ళిన మోగ్లీ తనను కలవడం, ప్రేమలో పడడం చకచకా జరుగుతాయి.
అంతా స్మూత్ గా ఉంటే కథ ముందుకు కదలదు కాబట్టి విలన్ క్రిస్టోఫర్ నోలన్(బండి సరోజ్ కుమార్) పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఇతను పేరుకి పోలీసే కానీ నిజానికి ఒక వ్యభిచారి, సైకో. ఏ ఆడపిల్లపైనైనా కన్ను పడితే ఆ పిల్ల జీవితం నాశనమే. అలాంటి క్రిస్టోఫర్ నోలన్ రెండు కళ్ళు.. మాట్లాడలేని, వినలేని జాస్మిన్ పై పడతాయి. ఇలాంటి సైకో నుంచి హీరో హీరోయిన్ లు ఎలా తప్పించుకున్నారు? విలన్ అంతు ఎలా చూశారు అన్నది మిగతా కథ. కథ వింటుంటే మీకు జయం గుర్తువస్తే మీకు సినిమాలలో మంచి నాలెడ్జి ఉన్నట్టే.. కీప్ ఇట్ అప్ గైస్.
ఇప్పుడే అనుకున్నట్టు జయంలో లాగే ఇక్కడా బలమైన, క్రూరమైన విలన్. అయితే గోపీచంద్ ప్లేసులో బండి సరోజ్ కుమార్. ఎంట్రీ సీన్ తోనే తను ఎలా అమ్మాయిలను లొంగదీసుకుంటాడో, ఎలా అనుభవిస్తాడో క్లియర్ గా చెప్పాడు దర్శకుడు. నిజానికి హీరో రోషన్ కంటే ఎక్కువ ఎలివేషన్, బిల్డప్ అంతా సరోజ్ కుమార్ కే దక్కింది. స్ట్రాంగ్ విలన్ ఉండడం ఎప్పుడూ కథకు మంచిదే కానీ సినిమాలో ప్రధాన పాత్రలతో ప్రేక్షకులు కనెక్ట్ అయినప్పుడు మాత్రమే సినిమాకు ప్రయోజనం. అలా కనెక్ట్ కాలేనప్పుడు విలన్ పాత్ర ఎలా ఉన్నా ఎటువంటి ఉపయోగం లేదు. ఫస్ట్ హాఫ్ కొంతమేరకు ఓకె అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా గాడితప్పింది. ముఖ్యంగా రామాయణం లో వనవాసం ప్రేరణతో పెట్టిన ఎపిసోడ్ లో రోషన్, సాక్షి, వైవా హర్ష అడవిలో ఉండడం, వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడానికి విలన్ డ్రోన్స్ పంపించడం మరీ ఓవర్ గా ఉంది. పాత సినిమాల తరహాలో సహజత్వానికి దూరంగా ఉండే డైలాగులు, ఫోర్స్డ్ సీన్స్ వల్ల ఎక్కడా ప్రేక్షకులకు రిలీఫ్ అనేది ఉండదు. ఈ నీరసానికి తోడు నేపథ్య సంగీతం కూడా వీక్ గా ఉండడంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు సినిమాకు శుభం కార్డ్ వేస్తారా అని ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా నిడివి రెండు గంటల నలభై నిముషాలు. అంత సేపు ఆడియన్స్ ఫోన్ చూసుకోకుండా, సిగరెట్ బ్రేక్ తీసుకోకుండా కూర్చోబెట్టాలంటే స్క్రీన్ ప్లే, నరేషన్ అంతా గ్రిప్పింగ్ గా ఉండాలి. కనీసం నీరసంగా ఉండే సీన్లను ఎడిట్ చేసినా ప్రేక్షకులకు కొంత రిలీఫ్ దక్కేది.
సినిమా రైటింగ్ పాత సినిమాలా మూస తరహాలో ఉంది. ఈ తరం ప్రేక్షకులకు చాలా దూరంలో ఉండిపోయింది. నిజానికి ఇలాంటి సినిమాలకు సంగీతం అద్భుతంగా ఉండాలి, మనసుని తాకే పాటలు ఉండాలి. కానీ సంగీతం యావరేజ్ గా ఉండడంతో ఆ ఫీల్ పూర్తిగా మిస్ అయింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోయేలా సీన్స్ ఉన్నపుడు సంగీతం కూడా నీరసంగా వాటికి తోడవడంతో ప్రేక్షకులు ఫోన్ తీసి వాట్సాప్ చెక్ చేసుకోక తప్పని పరిస్థితి కల్పించారు మేకర్స్. ఎడిటింగ్ కూడా వీక్ గా ఉంది. రిపీట్ సీన్స్, అనవసరమైన సీన్స్ ను నిర్దాక్షిణ్యంగా కత్తెర వేసి ఉంటే ప్రేక్షకులకు కాస్తైనా ఊరట దక్కేది. దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాలో మాత్రం తన ప్రతిభ చూపించలేకపోయాడు.
రోషన్ నటన పరవాలేదు కానీ హీరో పాత్ర కంటే నటనకు విలన్ పాత్రలో నటించిన సరోజ్ కుమార్ ఎక్కువ స్కోప్ దక్కింది. సరోజ్ కుమార్ నటన కూడా బాగుంది కానీ ఎమోషనల్ కనెక్ట్ లేకపోవవడం తో అది కూడా ఒక దశలో ఎక్కువైనట్టు అనిపిస్తుంది. జాస్మిన్ పాత్రలో నటించిన సాక్షి తన హావ భావాలతోనే ఆకట్టుకుంది.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1 ప్రిడిక్టబుల్ కథనం
2. మిస్ అయిన ఎమోషనల్ కనెక్ట్
3. సంగీతం
-ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. లీడ్ యాక్టర్స్ నటన
ఫైనల్ వర్డ్: అగ్లీ
రేటింగ్: 1. 75 /5
ఒక్క ప్రశ్న: అసలు క్రిస్టోఫర్ నోలన్ ఏం చేశాడయ్యా సందీప్ రాజూ.. ఒక జీనియస్ ఫిల్మ్ మేకర్ పేరును సైకో విలన్ కు పెట్టడం ఏంటి ? ఆయన సినిమాలు అర్థం కాకపోవడంతో ఈ రకంగా ఆయనపై కక్ష తీర్చుకున్నావా?