
మూవీ రివ్యూః షేర్ని
నటీనటులుః విద్యాబాలన్, శరత్ సక్సేనా, విజయ్ రాజ్, అరుణ్, బ్రిజేంద్ర కాలా, నీరజ్‌కబీ తదితరులు
దర్శకత్వంః అమిత్ వి. మసర్కర్
నిర్మాతలుః భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, అమిత్ వి. మసర్కర్
సంగీతంః బందిష్ ప్రొజెక్ట్
రిలీజ్ః అమెజాన్ ప్రైమ్
అడవితో మనిషికి ఉన్న బంధం ఈ నాటిది కాదు. రేపటితో అంతం అయ్యేది కూడా కాదు. మనిషి ఉన్నంత వరకు అడవి ఉండాల్సిందే. కానీ.. అడవులను నరికివేస్తుండడంతో అందులోని జంతువులన్నీ ఎటు వెళ్లాలో తెలియక జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్ లో మ్యాన్ ఈటర్ ఆ మధ్య సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. షేర్ని సినిమాలోనూ ప్రధాన కథ ఇదే. మనుషులను తినే ఓ పులి కోసం సాగించే వేటే.. ఈ సినిమా.
కథః మధ్యప్రదేశ్ లోని ఓ అటవీ ప్రాంతంలో రెండు పులులు సంచరిస్తుంటాయి. అందులో ఒక పులి మనుషులను చంపి తినేస్తుంటుంది. ఈ పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ విద్యా బాలన్. అయితే.. ఆ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుంటాయి. రాజకీయ లబ్ధికోసం ఈ పని జరగకుండా అడ్డుకుంటూ ఉంటారు పలువురు రాజకీయ నేతలు. మరి చివరకు ఏం జరిగింది? విద్యాబాలన్ పులిని పట్టుకుందా? రాజకీయ నాయకులు ఎలాంటి ఇబ్బందులు కలిగించారు? అన్నది మిగతా కథ.
విశ్లేషణః పులి/సింహం జనావాసాలపై దాడి చేయడం అనే కథతో చాలా సినిమాలు వచ్చాయి. మృగరాజు, మన్యం పులి వంటివి ఈ కోవకు చెందినవే. ఇతర భాషల్లోనూ చాలా వచ్చాయి. అయితే.. అందులో హీరోయిజం కూడా ఉంటుంది. కానీ.. ఈ చిత్రంలో అలాంటిది ఏమీ ఉండదు. అడవికి, మనిషి మధ్య ఉన్న సంబంధాన్ని అంతర్లీనంగా చెబుతూ.. మృగాళ్లాంటి మనుషుల దాడిలో బలయ్యే మహిళల జీవితాలను సమాంతరంగా చూపించాడు దర్శకుడు. ప్రధాన కథ అయిన ‘పులి దాడి’ చుట్టూ మిగిలిన సన్నివేశాలను అల్లుకున్నాడు.
అయితే.. పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తుండడం.. దాన్ని అడ్డుకునేందుకు స్వార్థ రాజకీయ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. అదే సమయంలో ఒక మహిళా అధికారి ఏ ఉద్యోగంలో ఉన్నా.. హేళనలు, వెక్కిరింపులు, వేధింపులు తప్పవనే విషయాన్ని పర్ఫెక్ట్ గా డీల్ చేశాడు దర్శకుడు. పులిని చంపాలని నిర్ణయించడంతో వేటగాళ్లు రంగంలోకి దిగడం.. చంపకుండా పట్టుకొని వేరే ప్రాంతానికి తరలించాలంటూ విద్యాబాలన్ చేసే ప్రయత్నాన్ని ఆసక్తికరంగా మలిచాడు. దర్శకుడు.
పెర్ఫార్మెన్స్ః అటవీ అధికారి పాత్రలో విద్యా బాలన్ జీవించింది. ఒక అధికారిగా, సగటు కుటుంబ మహిళ రెండు పార్శ్వాల్లోనూ అద్భుతంగా నటించింది. పై నుంచి వచ్చే ప్రెజర్ ను ఫేస్ చేసే ఆఫీసర్ గా ఆకట్టుకుంది. బ్రిజేంద్ర కామిడీ కూడా నవ్వించింది. మిగిలిన పాత్రధారులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఆకట్టుకుంటాయి. ఇలాంటి సినిమాలకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆయువుపట్టు. దీన్ని ఏ మాత్రం సడలనీయకుండా బెనిడిక్ట్ టేలర్ అదరగొట్టాడు.
బలాలుః విద్యా బాలన, దర్శకత్వం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్
బలహీనతలుః ఎడిటింగ్, ఫ్యామిలీ సన్నివేశాలు
లాస్ట్ లైన్ః గర్జించిన ‘షేర్ని’
రేటింగ్ః 3/5