LGM Movie Review : లెట్స్ గెట్ మ్యారీడ్ మూవీ చాలా కాలంగా ఆసక్తి రేపుతోంది. దానికి ఒకే ఒక రీజన్ క్రికెటర్ ధోని నిర్మాత కావడం. ధోని ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ ఏర్పాటు చేసి మొదటి ప్రయత్నంగా లెట్స్ గెట్ మ్యారీడ్ మూవీ తీశారు. ఆల్రెడీ తమిళంలో విడుదలైన ఈ చిత్రం తెలుగులో ఆగష్టు 4న విడుదల చేశారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం…
కథ:
గౌతమ్ (హరీష్ కళ్యాణ్), మీరా(ఇవానా) రెండేళ్లుగా ప్రేమించుకుంటూ ఉంటారు.డేటింగ్ బోర్ కొట్టడంతో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. గౌతమ్ తల్లి లీలా(నదియా) ఎప్పటి నుండో కొడుకు పెళ్లి కోసం ఎదురుచూస్తుంది. అందుకే గౌతమ్ పెళ్లి చేసుకుంటా అనగానే ఎస్ చెబుతుంది. అయితే మీరాకు అత్త కింద కాపురం చేయడం ఇష్టం ఉండదు.అందుకే పెళ్ళైన వెంటనే వేరు కాపురం పెట్టాలంటుంది. దానికి గౌతమ్ ససేమిరా ఒప్పుకోడు. అమ్మను వదిలి దూరంగా ఉండటం కుదరదంటాడు. అయితే నాకు మీ అమ్మగారు నచ్చితేనే కలిసి ఉంటాను లేదంటే ఉండను అంటుంది.
అత్తా కోడళ్లకు భవిష్యత్ లో పడుతుందో లేదో తెలుసుకోవడానికి ఇరు కుటుంబాలు ఒక టూర్ కి వెళతారు. అప్పుడు మీరా, లీలా మధ్య సఖ్యత కుదిరిందా? గౌతమ్, మీరా పెళ్లి జరిగిందా? లేదా? అనేది మిగతా కథ…
విశ్లేషణ:
కథ వింటుంటేనే ఇది సత్యకాలపు సీరియల్ స్టోరీ అని అర్థం అవుతుంది. ఇలాంటి బలహీనమైన కథను అంతకంటే బలహీనమైన స్క్రీన్ ప్లేతో నడిపి దర్శకుడు ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేశాడు. ఏ దశలో కూడా సినిమా ఊపందుకున్న దాఖలాలు లేవు. అసలు హీరోకి కథలో ప్రాధాన్యత ఉండదు. అత్తా కోడళ్ల ఎపిసోడ్స్ మొదలయ్యాక హీరో పాత్ర ఫేడ్ అవుట్ అయిపోయింది. ఏదో వచ్చిపోతుంటాడు.
సీరియల్ తరహా సన్నివేశాలతో దర్శకుడు లాగించేశాడు. స్క్రిప్ట్ లో విషయం లేకపోవడంతో నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రమే. ధోనీ ఈ చిత్రానికి పెద్దగా డబ్బులు ఖర్చు చేయలేదనిపిస్తుంది. ఇక అవసరం ఉన్న లేకున్నా ప్రతి సీన్లో యోగిబాబు వచ్చి నవ్వులు పంచే ప్రయత్నం చేశాడు. కొన్ని సార్లు ఆయన కామెడీ నవ్విస్తే మరికొన్నిసార్లు విసిగించింది.
హీరో కంటే కూడా యోగిబాబునే దర్శకుడు నమ్ముకుని సినిమా తీసినట్లు ఉంది. ధోని నిర్మాతగా సినిమా అనగానే ఎన్నో అంచనాలు పెట్టుకొని వెళ్లిన ప్రేక్షకుడికి నిరాశ తప్పదు. ఎడిటింగ్ లో కొంత సినిమా తీసేసినా ఇంకా విసుగుపుడుతుందేమో అనిపిస్తుంది. సాంగ్స్ కూడా మెప్పించలేదు. నదియా, లవ్ టు డే ఫేమ్ ఇవానా మాత్రం తమ పాత్రలకు న్యాయం చేశారు.
చూడాలా? వద్దా?:
లెట్ గెట్ మ్యారీడ్ ఏమాత్రం కంటెంట్ లేని సీరియల్ డ్రామా. అటు కామెడీ ఇటు ఎమోషన్ ఏదీ వర్క్ అవుట్ కాలేదు. అరాకొరా స్క్రిప్ట్ తో దర్శకుడు రమేష్ తమిళ్ మణి లాగించేశాడు. మొత్తంగా చెప్పాలంటే నిర్మాతగా ధోని మొదటి ప్రయత్నం ఫెయిల్.
రేటింగ్: 2/5
తారాగణం : హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు…
సినిమాటోగ్రఫీ : విశ్వజిత్ ఒదుక్కత్తిల్
ప్రొడక్షన్ కంపెనీ : ధోని ఎంటర్‌టైన్‌మెంట్
ప్రొడ్యూసర్ : సాక్షి సింగ్ ధోని, వికాస్ హస్జా
డైరెక్షన్, మ్యూజిక్ : రమేష్ తమిళ్ మణి