నవరసాలూ పండించే కోట శ్రీనివాసరావుకు ఆయన కుమారుడు ‘కోట వెంకట ఆంజనేయ ప్రసాద్’ అంటే, ఆయనకు ఎంతో ఇష్టం. అయితే తన కుమారుడు కూడా తనలాగే మంచి నటుడు అవ్వాలని ఆయన ఆశ పడ్డాడు. కానీ, ఎందుకో కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ కు నటన పై పెద్దగా ఆసక్తి ఉండేది. కానీ, అవి 2010 సంవత్సరం నాటి రోజులు.. కోట కుమారుడు యాక్సిడెంట్ లో చనిపోవడానికి కరెక్ట్ గా ఏడాది ముందు. హీరో మరియు దర్శకుడు జె.డి.చక్రవర్తి కోటగారి కోసం ఆయన ఇంటికి వెళ్లారు.
అక్కడ కోట కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ ను చూసి జేడీ బ్లైండ్ గా ఒకటి ఫిక్స్ అయ్యారు. తన సినిమాలో ప్రసాద్ ఒక క్యారెక్టర్ కి బాగా సూట్ అవుతాడు. ఈ విషయం చెప్పగానే ప్రసాద్ కూడా అంగీకరించారు. తన తండ్రి కోరిక తీర్చాలనే ఉద్దేశ్యం ఆయనలో కలిగింది ఏమో. అందుకే జేడీ అడగ్గానే వెంటనే నటించడానికి ఒప్పుకున్నారు. విషయం కోట దగ్గరకు చేరింది. కాకపోతే కోటగారికి ఎక్కడో భయం మొదలైంది.
ప్రసాద్ బాగా నటించకపోతే.. కోట కొడుక్కి నటన రాదు అని వెక్కిరిస్తారు. అందుకే కోట ఏ నిర్ణయం తీసుకోలేక ఆలోచనలో పడ్డారు. అది గమనించిన చక్రవర్తి ‘మీకెందుకండీ కోటగారు.. మీ అబ్బాయితో నేను చేయిస్తానుగా’ అని కోటగారికి భరోసా ఇచ్చాడు. అయితే, తన కొడుకు చేత మంచి విలన్ వేషాలు చేయించండయ్యా’ అని తన మనసులో మాట చెప్పారు కోట. ‘మేమూ విలన్ పాత్రనే చేయిస్తున్నామండీ’ అంటూ చక్రవర్తి కోట చేతిలో చేయి పెట్టి అభయం ఇచ్చాడు.
ఆ అభయమే ఇప్పుడు కోటగారికి పెద్ద రిలీఫ్ ను ఇస్తోంది. చనిపోయిన కొడుకును తన దగ్గర ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అంటే, తన కొడుకు నటించిన ఆ సినిమా వల్లే. ఈ లోకంలో లేని తన కొడుకుని తల్చుకుంటూ.. తన కొడుకు నటించిన సినిమాని చూస్తూ తనలోని తండ్రితనాన్ని సంతృప్తి పరుచుకుంటున్నారు. అందుకే కోటగారు ఇప్పటికీ.. ‘నాకు జె.డి.చక్రవర్తి చేసిన మేలును నేను మర్చిపోకూడదు’ అంటూ ఎమోషనల్ అవుతుంటారు.