
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల వ్యవహారమై ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. కొందరు తాము అధ్యక్ష బరిలో ఉన్నామని ప్రకటిస్తే.. ప్రకాష్ రాజ్ ఏకంగా ప్యానెలే ప్రకటించారు. ఇక, విమర్శలు ప్రతి విమర్శలు అన్నీ జరిగిపోయాయి. ఇక, జరగాల్సింది ఎన్నికే. అయితే.. లెక్క ప్రకారం సెప్టెంబరులో ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే.. ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. అసలు ఎన్నిక ఉంటుందా? ఏకగ్రీవమా? అన్నది కూడా క్లారిటీ లేదు. ఈ విషయానికి సంబంధించి మూడు రోజుల్లో క్లారిటీ రానుంది.
ఇందులో భాగంగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే బుధవారం లేదా గురువారం ఈ సమావేశం జరుగుతుందని సమాచారం. కరోనా ఉన్నందున్న మా కార్యాలయంలో కాకుండా.. వర్చువల్ గా ఈ మీటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సమావేశంలో మా సర్వసభ్య సమావేశాన్ని ఎప్పుడు జరపాలి? ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి? అనే విషయమై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
దీంతోపాటు.. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ సభ్యుల జీవిత బీమాకు చెల్లించాల్సిన ప్రీమియం ఇష్యూను కూడా డిస్కస్ చేయనున్నారని టాక్. అదేవిధంగా.. మా లో జీవితకాల సభ్యత్వాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై కూడా ఒక నిర్ణయం తీసుకోనున్నారట. మొత్తంగా.. ఇప్పటి వరకు లేవనెత్తిన సమస్యలన్నింటినీ ఈ సమావేశంలో చర్చిస్తారని వినికిడి.
ఫలితంగా.. ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఈ భేటీలో ఎగ్జిక్యూటివ్ సభ్యులు, ‘మా’ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కృష్ణం రాజు కూడా పాల్గొంటారని సమాచారం. అదేవిధంగా.. ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు న్యాయ సలహాదారును కూడా ఆహ్వానిస్తారని తెలుస్తోంది. కరోనా థర్డ్ వేవ్ గోల లేకపోతే.. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరులోనే ఎన్నిక నిర్వహించాలని సినీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా.. మా ఎన్నికలపై ఓ స్పష్టమైన ప్రకటన ఈ సమావేశంలో రానుందని తెలుస్తోంది. మరి, ఎలాంటి నిర్ణయం వస్తుందన్నది చూడాలి.