తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) రచ్చ ఏ స్థాయిలో కొనసాగుతోందో అందరికీ తెలిసిందే. అధ్యక్ష బరిలో నేనున్నానంటే.. నేనున్నానంటూ ఒక్కొక్కొరిగా ప్రకటించుకుంటున్నారు. ఇప్పటికే ఐదుగురు అధికారికంగా అనౌన్స్ చేశారు. ఎన్నికలు మొదలయ్యే నాటికి ఇంకా ఎంత మంది వస్తారో కూడా తెలియని పరిస్థితి.
మా ఎన్నికల్లో తొలుత ద్విముఖ పోరు జరుగుతుంది అన్నట్టుగా.. ఓ వైపు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మరోవైపు మంచు విష్ణు బరిలోకి దిగారు. ఆ తర్వాత తానూ ఉన్నానంటూ వచ్చేశారు జీవిత. ఇప్పుడు చూస్తే మరో ఇద్దరు కూడా మేము సైతం అన్నారు. వారిలో క్యారెక్టర్ ఆర్టిస్టు హేమ, సీవీఎల్ నరసింహారావు ఉన్నారు.
అయితే.. ఇందులో ప్రకాష్ రాజ్ కు మెగా కాంపౌండ్ మద్దతు పలుకుతోంది. ఈ విషయాన్ని నాగబాబు అఫీషియల్ గానే అనౌన్స్ కూడా చేశారు. మంచు విష్ణుకు బాలకృష్ణ, కృష్ణ తదితరులు సపోర్టుగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో.. పోరు హోరాహోరీగా సాగుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి.
నిజానికి ఈ స్థాయి పోరాటం.. ఆరాటం ఇంతకు ముందెన్నడూ లేదు. గతంలో ఏకగ్రీవంగానే మా ఎన్నిక జరిగేది. అసలు.. ఆ కమిటీ అధ్యక్షుడు ఎవరో.. ప్యానల్ మెంబర్ ఎవరో కూడా జనాలకు తెలిసేది కాదు. అలా ఎన్నిక ముగిసేది. కానీ.. రానురానూ ఆధిపత్య పోరు మొదలైంది. గడిచిన మూడు దఫాల్లో ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కూడా మరోసారి ఎన్నికలు అనివార్యం కావడమే కాకుండా.. గతంలో ఎన్నడూ లేనంత రచ్చ జరుగుతోంది.
దీనిపై.. ఇండస్ట్రీ పెద్దలు అంతర్మథనం చెందుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇది ఏ మాత్రం మంచి వాతావరణం కాదని, ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా.. ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సారి మహిళను ఎన్నుకోవాలని గతంలో చిరంజీవి వ్యాఖ్యానించారని ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ వంటి వారు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ గొడవలకు పుల్ స్టాప్ పెడుతూ.. ఏకగ్రీవం చేయాలని చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్న జయసుధ పేరును పరిశీలిస్తున్నట్టు కూడా చెబుతున్నారు. కానీ.. ఇది ఎంత వరకు సాధ్యమనేది ప్రశ్న. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండడంతో.. అప్పటి వరకు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.