Celebrities Used Surrogates: సినిమాల మీదే ఆధారపడి జీవనం గడిపే కుటుంబాలు చాలానే ఉంటాయి. అయితే సినిమాలు కాకుండా సినిమా వాళ్లకు వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది. తమ జీవితంలో పిల్లలు ఉండాలని వారు కోరుకుంటూ ఉంటారు. అయితే తల్లిదండ్రులుగా మారడానికి నేరుగా పిల్లలను కనకుండా సరోగసి విధానం ఎంచుకుంటున్నారు. గర్భం దాలిస్తే అవకావాలు తగ్గిపోతాయి.. కొందరు లేటు వయసులో పిల్లలు కనడం ఇష్టం లేక, ఇంకొందరు అనారోగ్య కారాణాలతో అద్దెగర్భం ద్వారా పిల్లలను కంటే.. మరికొందరు.. అందం తగ్గుతుందన్న ఆలోచనతో అద్దె గర్భంలో పిల్లలను పెంచుకొని, పుట్టిన తర్వాత తీసుకునే పద్ధతికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. తాజాగా నయనతార దంపతులు ఈ విధంగానే తల్లిదండ్రులయ్యారు. ఈ విధానం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ఇదివరకు పలువురు అద్దెగర్భం ద్వారా తల్లిదండ్రులు అయ్యారు.

సరోగసిలో రెండు విధానాలు
సరోగసి విధానంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ట్రెడిషనర్ సరోగసి, రెండోది జెస్టేషనల్ సరోగసీ. వీటి గురించి తెలుసుకుందాం..
ట్రెడిషనల్ సరోగసీ..
ట్రెడిషనల్ పద్దతిలో భార్యకు సమస్య ఉన్నప్పుడు భర్త నుంచి వీర్యాన్ని సేకరించి దాన్ని మరో మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టి బిడ్డ కంటారు. ఈ విధానంలో పుట్టే బిడ్డకు సరోగసీ పద్ధతికి ఒప్పుకున్న తల్లికి జన్యు సంబంధం ఉంటుంది. బిడ్డకు ఆమె పోలికలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
జెస్టేషనల్ సరోగసీ..
జెస్టేషనల్ పద్ధతిలో భార్య నుంచి అండాన్ని, భర్త నుంచి వీర్యాన్నీ సేకరించి ల్యాబ్‌లో ఫలదీకరించి మరో స్త్రీ గర్భంలో ప్రవేశ పెడతారు. ఇలా చేయడం వల్ల గర్భం మోసే తల్లికి, బిడ్డకు ఎటువంటి జన్యు సంబంధం ఉండదు. సరోగసీ మదర్ వివరాలను కూడా చాలా గోప్యంగా ఉంచుతారు. దాదాపు ఈ విధానంలోనే ఎక్కువ మంది సెలెబ్రిటీలు బిడ్డలను కంటారు.
బాలివుడ్‌లో పేరెంట్స్ అయిన వారు..
– బాలీవుడ్ బాద్షాగా పేరు గాంచిన షారుఖ్‌ఖాన్, గౌరీఖాన్ దంపతులు కూడా మూడో బిడ్డకు సరోగసి ద్వారా జన్మనిచ్చారు. లేటు వయసులో పిల్లల్ని కనడం ఇబ్బందికరం అనే ఉద్దేశంతో గౌరీఖాన్, షారుఖ్ ఖాన్ దంపతులు సరోగసీకి ముందుకు వచ్చారు.
– బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్ట్‌గా పేరు గాంచిన అమీర్‌ఖాన్‌కు, రెండో భార్య కిరణ్ రావుకు సరోగసీ ద్వారా మగ బిడ్డ జన్మించింది. 36 ఏళ్ల కిరణ్‌రావ్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అద్దె గర్భం ద్వారా వీరు బిడ్డను పొందారు.
– బాలీవుడ్ కు చెందిన బడా నిర్మాత, దర్శకుడు అయిన కరణ్ జోహార్ పెళ్లి చేసుకోకుండా సరోగసి ద్వారా ఇద్దరు బిడ్డలను కలిగి ఉన్నాడు. తన తల్లి సహాయంతో ఆ ఇద్దరు పిల్లలను కరణ్ చూసుకుంటున్నాడు.
– ఒకప్పుడు బూతు సినిమాలు తీసి, ఇప్పుడు బాలీవుడ్‌లో పాగా వేసి స్టార్ సన్నీలియోన్ కూడా ఇదే తరహాలో ఇద్దరు కవలలను కలిగి ఉంది. ఈ ఇద్దరు పిల్లలతోపాటు ఆమె మరో బిడ్డను దత్తత తీసుకుంది.
– ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు కూడా సరోగసి విధానంలోనే తల్లిదండ్రులయ్యారు. ప్రియంక చోప్రా, నిక్‌లు డిసెంబర్ 2018లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగి రెండేళ్ల తర్వాత తాము ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యమంటూ సడెన్ సర్ర్‌పైజ్ నిస్తూ నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా తమ సంతోషాన్ని అందరితోను పంచుకున్నారు. వీరు సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయ్యారు.
తెలుగు ఇండస్ట్రీలో..
– ఇక మన తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన మంచు లక్ష్మి సరోగసీ ద్వారా తల్లి అయింది. గుజరాత్ కు చెందిన ఒక మహిళ ద్వారా మంచు లక్ష్మి తల్లి అయింది.
– తెలుగు ఇండస్ట్రీకి ప్రేమంటే ఇదేరా చిత్రం ద్వారా టాలీవుడ్ అభిమానులు దగ్గరైన బాలీవుడ్ నటీ ప్రీతిజింటా సరోగసి ద్వారా తల్లి అయింది. ఆమెకు కవల పిల్లలు ఒక కుమారుడు, కుమార్తె పుట్టారు. అమెరికాకు చెందిన ఆర్థిక నిపుణుడు జెనె గుడెనఫ్‌ను 2016లో వివాహం చేసుకుంది ప్రీతి. పెళ్లయిన నాటి నుంచి వెండి తెరకు దూరంగా ఉంటున్నారు. వివాహం జరిగిన తరువాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉంటుంది. 46 ఏండ్ల వయసులో ప్రీతి జింటా తల్లయిన సంబురంలో మునిగిపోయారు.

– తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార తల్లయ్యారు. నయనతార–విఘ్నేష్ శివన్ కపుల్‌కు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరూ మగపిల్లలే. కాగా ఈ సెలబ్రిటీ దంపతులు సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయ్యారని ప్రచారం జరుగుతుంది. ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్–విక్కీలు జూన్ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుక మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. ఇప్పుడు కవలలకు జన్మనిచ్చారు.
సరోగసిపై ఇండియాలో నిషేధం..
సెలబ్రెటీలు, హీరోయిన్స్ సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులు అవుతుందటే.. తాజాగా, సీనియర్ హీరోయిన్ కస్తూరి ట్వీట్ దుమారం రేపుతోంది. ‘ఇండియాలో సరోగసీపై బ్యాన్ ఉంది. వైద్యపరంగా అనివార్య కారణాల కోసం తప్పంసరోగసిని ప్రోత్సహించకూడదు.. ఈ చట్టం జనవరి 2022 నుంచి అమల్లోకి వచ్చింది. దీని గురించి మనం రాబోయే రోజుల్లో చాలా వినబోతున్నాం’ అంటూ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. అయితే ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అన్నది ఎక్కడా కస్తూరి ప్రస్తావించలేదు. అయితే ఈ ట్వీట్ నయన్ దంపతుల గురించే అని ఫిక్సయిన ఫ్యాన్స్ కస్తూరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెట్టారు. పక్కన వాళ్ల గురించి పట్టించుకోవడం మానేసి.. తన పని తాను చూసుకోవాలని హితబోధ చేశారు. ఇక నెటిజన్లకు కూడా తన మార్క్ కౌంటర్ ఇచ్చారు కస్తూరి. లాయర్‌గా అర్హత సాధించిన వ్యక్తిగా చట్టపరమైన అంశాలపై విశ్లేషణ చేసే హక్కు ఉందని ఆమె పేర్కొన్నారు. నిస్వార్ధంగానే మాట్లాడాను..ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవని రిప్లయి ఇచ్చారు.