Most watched Indian film : నిరంతరం ఉరుకుల పరుగుల జీవితంలో పడి అలసని మనసులకు సేదతీరాలి అనిపించే వినోదం సినిమా. అది ఏ కాలమైనా సరే ప్రజలను అలరించడమే చిత్రపరిశ్రమ పరమావధి. అది బ్లాక్ అండ్ వైట్ రోజులైనా సరే కలర్‌ఫుల్ స్క్రీన్స్ అయినా సరే చూసిన ఆ రెండున్నర లేదా మూడుగంటల సేపు మనకున్న స్ట్రెస్ లేదా టెన్షన్స్ ను మరిచిపోయి ఆ సినిమాలో లీనయ్యేంతలా చేస్తుంది మూవీ. మూకీ సినిమాల నుంచి టాకీ చిత్రాల దాకా ఎక్కడా కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌కు లోటురాకుండా.. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉంటుంది కళాపరిశ్రమ. ఇక ఈ చిత్రపరిశ్రమకు అభిమానులు కూడా అదే రేంజ్ లో ఉంటారండోయ్.. తమకు నచ్చిన నటీనటులకు గుళ్లు కట్టి మరీ ఆదరిస్తారు, ఆరాధిస్తారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లను మించి..
ఇక ఒకప్పుడు సినిమాలకు థియేటర్లలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదనుకోండి. ఇప్పుడంటే ఓటీటీలు వచ్చి సినిమాలను సెల్ ఫోన్లో చూసేస్తున్నారు కానీ అప్పట్లో మాత్రం ఎక్కడో ఓ చోటు మాత్రమే ఉన్న సినిమా హాల్ కి మారుమూల గ్రామాల నుంచి మరీ వెళ్లి సినిమాను చూసి ఆదరించేవారు. ఇప్పుడు ఓ సినిమా వందరోజులు ఆడడం అంటే పెద్ద వింతే అని చెప్పాలి. రిలీజైన రెండుమూడు వారాలకే తట్టాబుట్టా సర్దేసుకుంటున్నాయి. కానీ ఆనాటి రోజుల్లో కొన్ని సినిమాలను రీరిలీజ్ లు చేసి మరీ వందల రోజులు ఆడించారంటే ఆ సినిమాకు ఉండే ప్రేక్షకాదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో సినిమా పాతిక, యాభై, వంద, రెండు వందల రోజులు కూడా ఆడేవి. అయితే ఇప్పటివరకు తీసిన సినిమాల్లో ఏ చిత్రాన్ని ఎక్కువ మంది ప్రేక్షకులు చూశారో తెలుసా? మీరనుకోవచ్చు భారతదేశ సినీ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిచెప్పిన ఘనత బాహుబలి, ఆర్ఆర్ఆర్ మూవీలకు మాత్రమే ఉంది కనుక వాటినే ఎక్కువ మంది చూసి ఉంటారు అని.. కానీ అలా అనుకుంటే మీరు పొరబడినట్టే. బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, దంగల్ సినిమాల కన్నా కూడా అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన షోలే మూవీని ఎక్కుమంది ప్రేక్షకులు చూసి ఆదరించారు. బాలీవుడ్ అగ్రనటుడు అంజాద్ ఖాన్‌కు ఇది తొలి చిత్రం. ఈ మూవీలో ధర్మేంద్ర, హేమమాలిని, జయా బచ్చన్ ఇలా బాలీవుడ్ అగ్రతారలు నటించారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ ల వద్ద టికెట్ల ఊచకోత జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి సంబంధించి 25 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి.
షోలేను టచ్ కూడా చెయ్యలేరు
దర్శకుడు రమేశ్ సిప్పీ తెరకెక్కించిన ఈ ఐకానిక్ చిత్రం 1975లో విడుదలయ్యింది. అలా రిలీజైన తొలి షోకే ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫలితంగా ఆల్‌టైం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు దేశంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీస్ లిస్ట్ లో ప్రథమ స్థానంలోనూ నిలిచింది. ఈ రికార్డును దాదాపు దశాబ్ద కాలంపాటు ఏ సినిమా కూడా టచ్ చేయలేకపోయింది. షోలే విడుదలైనప్పుడు, ఆ తర్వాత రీరిలీజ్‌అయినప్పుడు మొత్తంగా భారత్‌లో 15 నుంచి 18 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి.

ప్రపంచ దేశాల్లోనూ షోలే హవా..
షోలే క్రేజ్ కేవలం భారత్ కే పరిమితం కాలేదు.. ఇతర దేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే ఒక్క రష్యాలోనే 6 కోట్ల టికెట్లు విక్రయించారు. ఇక మిగిలిన దేశాల్లో ఎంత తక్కువలో తక్కువ అనుకున్నా దాదాపు 2 కోట్ల దాకా టికెట్లు అమ్ముడుపోయాయట! అంటే వరల్డ్ వైడ్ గా 22 -26 కోట్ల దాకా టికెట్లు అమ్ముడయ్యాయి. తద్వారా బాక్సాఫీస్ లను ఊచకోత కోసిన చిత్రంగా భారతీయ సినీచరిత్రలో షోలే రికార్డు సృష్టించింది. 1975లో వచ్చిన సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.35 కోట్ల దాకా రాబట్టింది. ఇక ఇప్పటి మార్కెట్ రేటుతో పోలిస్తే దాని విలువ సుమారు రూ.2800 కోట్ల దాకా ఉంటుంది.
మరి భారత్ లోని టాప్ 10 మూవీస్
కేవలం భారత్‌లోనే అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాల లిస్ట్ విషయానికి వస్తే. షోలే 15 కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2: ది కన్‌క్లూజన్ 12 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొఘల్ ఇ ఆజమ్, మదర్ ఇండియా సినిమాలు చెరో 10 కోట్లు మూడో స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో హమ్ ఆప్కే హై కోన్ 7.4 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ముఖద్దార్ కా సికిందర్ 6.7 కోట్లు, అమర్ అక్బర్ ఆంటోని 6.2 కోట్లు, క్రాంతి 6 కోట్లు, బాబీ 5.3 కోట్లు, గంగా జమున 5.2 కోట్లు, గదర్, కేజీఎఫ్ చాప్టర్ 2, సంఘం చెరో 5 కోట్లతో మిగిలిన స్థానాల్లో నిలిచాయి.