కాగా, ఈ సినిమాకు సంబంధించి మోహన్ బాబు పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. వాటిలో ఆయన సీనియర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా డైనమిక్ లుక్స్ తో కనిపిస్తున్నారు. సినిమాలో ఆయన పాత్రపేరు భక్తవత్సలం నాయుడు. ఎయిర్ ఫోర్స్ లో తెలుగు ప్రాంతానికి చెందిన ఉన్నతస్థాయి అధికారిగా ఆయన కనిపించనున్నారు. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు అనే విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఆయనది సూర్యకు మార్గనిర్దేశకునిగా ఉండే పాత్ర. తమిళ వెర్షన్ కోసం తన పాత్రకు ఆయన స్వయంగా డబ్బింగ్ చెప్పారు.
మోహన్ బాబుపై చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణ అవుతాయనీ, ఆయన పాత్రను అభిమానులు బాగా లైక్ చేస్తారనీ చిత్ర బృందం చెబుతోంది.
సామాన్యులకు సైతం విమాన యానాన్ని సులభతరం చేయడానికి ఎయిర్ దక్కన్ అనే ఎయిర్ లైన్ సంస్థను స్థాపించిన కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ‘ఆకాశం నీ హద్దురా’ రూపొందుతోంది. ఈ సినిమాలో సూర్య జోడీగా అపర్ణా బాలమురళి నటిస్తున్నారు.
2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమా బాలీవుడ్ నిర్మాత గునీత్ మోంగా కు దక్షిణాదిన తొలి సినిమా కావడం గమనార్హం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.