VISHWAMBHARA Teaser Review :దసరా పండగను పురస్కరించుకుని చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభర టీజర్ విడుదల చేశారు. దర్శకుడు వశిష్ట గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. పాన్ ఇండియా రేసులో క్వాలిటీ పిక్చర్స్ అందించేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. టాలీవుడ్ అతిపెద్ద చిత్ర పరిశ్రమగా ఎదిగింది. వందల కోట్ల బడ్జెట్ తో స్టార్ హీరోల చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఆ కోవలోకి విశ్వంభర సైతం వస్తుంది. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉంది. 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నేడు దసరా పండగను పురస్కరించుకుని విశ్వంభర టీజర్ విడుదల చేశారు.
ఒకటిన్నర నిమిషాలకు పైగా సాగిన టీజర్ గూస్ బంప్స్ రేపింది. విజువల్స్ అబ్బురపరిచాయి. ప్రేక్షకులను దర్శకుడు మరో ప్రపంచానికి తీసుకెళ్లాడు. సినిమా కాన్సెప్ట్ తెలియజేసేలా… వాయిస్ ఓవర్ ఉంది. ”విశ్వాన్ని అలుముకున్నప్పుడు ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు, ప్రశ్నలు సృష్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది” అనే డైలాగ్ ఆలోచన రేకెత్తిస్తుంది. దుష్టుల అరాచకాలు ఎక్కువైతే యుద్ధం అనివార్యం. ఆ యుద్దానికి ఓ వీరుడు ప్రాతినిధ్యం వహిస్తాడని… ఆ డైలాగ్స్ తెలియజేస్తున్నాయి. ఇక టీజర్ చివర్లో రెక్కల గుర్రంపై చిరంజీవి వచ్చి… దుష్టులను ఊచకోత కోయడం… గూస్ బంప్స్ రేపింది.
విశ్వంభర సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్. సిజీ వర్క్ పెద్ద మొత్తంలో ఉంది. యూవీ క్రియేషన్ భారీగా ఖర్చు చేస్తున్నారనిపిస్తుంది. కీరవాణి బీజీఎమ్ సైతం ఆకట్టుకుంది. మొత్తంగా టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. చిరంజీవికి జంటగా… త్రిష నటిస్తుంది. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా చిరంజీవి ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దాంతో షూటింగ్ లో పాల్గొనలేదు. ఈ కారణంగా విశ్వంభర విడుదల తేదీ వాయిదా పడనుంది అన్నారు.
విశ్వంభర టీజర్లో విడుదల తేదీ తెలియజేయలేదు. దాంతో పుకార్లు నిజమే అనిపిస్తుంది. 2025 జనవరి 10న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వంభర సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న క్రమంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఆ తేదీన విడుదల చేస్తారనే ప్రచారం అవుతుంది.