Megastar Chiranjeevi Speech: మరో నాలుగు రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) మూవీ విడుదల సందర్భంగా నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్, అభిమానుల కేరింతల మధ్య, ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ ఈవెంట్ లో వెంకటేష్ చేసిన సందడి, అనిల్ రావిపూడి మాట్లాడిన మాటలు, చిరంజీవి ఉత్సాహాన్ని చూస్తుంటే, భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టేసిన ఫీలింగ్ మెగా అభిమానుల్లో కలిగింది. ఇంత అద్భుతంగా ఈమధ్య కాలం లో ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. కచ్చితంగా ఈ ఈవెంట్ సినిమా పై భారీ హైప్ ని పెంచింది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘వెంకటేష్ నాకు సోదర సమానుడు, అత్యంత ఆప్త మిత్రుడు. ఆయన్ని ఎప్పుడు కలిసినా నాలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. మన అందరికీ తెలిసిన వెంకీ చాలా సరదాగా ఉంటాడు, అందరినీ నవ్విస్తూ ఉంటాడు. కానీ ఆయనతో ఏకాంతంగా కూర్చున్నప్పుడు, మనిషి జీవితం అంటే ఇదా అని అనిపిస్తుంది. అంత గొప్పగా ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మా వెంకీ మోడరన్ డ్రెస్ వేసుకున్న ఒక చిన్న సైజు గురూజీ అని చెప్పొచ్చు. మేము కొన్నేళ్ల క్రితం న్యూ యార్క్ కి వెళ్ళాము. అక్కడ నేను కుర్చీలో కూర్చొని ఉంటే, వెంకటేష్ నా పక్కనే నిల్చొని ఉన్నాడు. ఇది మా స్నేహితులు చూసి మీరిద్దరూ ఇలా పక్క పక్కనే ఉంటే చూసేందుకు ఎంత బాగుందో అనేవాళ్ళు’.
‘అప్పుడు వెంకటేష్ నాతో మాట్లాడుతూ ఒక సినిమా చేద్దాం చిరు, నువ్వు కూర్చొని ఆర్డర్లు ఇస్తే పక్కనే నిల్చొని చేసే క్యారక్టర్ చేస్తాను. వాడిని నరికేయ్ వెంకీ అని చెప్పగానే , నేను వెళ్లి నరుక్కొని వస్తాను, ఎప్పటి నుండో మన కాంబినేషన్ లో ఇలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అని అనేవాడు. నాకు కూడా ఆ ఐడియా అద్భుతంగా అనిపించింది. ఒకరోజు అనిల్ కథ చెప్తున్నప్పుడు ఇక్కడ మన వెంకీ ఉంటే బాగుంటుంది, కాస్త చూడు అని చెప్పగానే, మా ఇద్దరి కాంబినేషన్ లో అనేక సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈ సినిమా కోసం వెంకటేష్ 18 రోజులు పని చేసాడు. ప్రతీ రోజు అతనితో కలిసి నేను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అసలు షూటింగ్ చేస్తున్నట్టే అనిపించలేదు. సరదాగా మేమిద్దరం గడిపినట్టు ఉంది. కచ్చితంగా నేను, వెంకటేష్ పూర్తి స్థాయి మల్టీస్టార్రర్ చిత్రం చేస్తాము, దానికి అనిల్ రావిపూడి నే డైరెక్టర్, కానీ ఎప్పుడొస్తుందో ఆ సినిమా ఇప్పుడే చెప్పలేను’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి.