Chiranjeevi Bhola Shankar: వాల్తేరు వీరయ్య లాంటి సక్సెస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన మరో సినిమా భోళాశంకర్. భారీ తారాగణంతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా దర్శకుడు మెహర్ రమేష్ చిరు కామెడీని, మేనియాను సద్వినయోగం చేసుకోవడం లో పట్టుతప్పాడు.
ఒకప్పుడు చిరంజీవి నటించిన దొంగ మొగుడు, రౌడీ అల్లుడు, స్టేట్ రౌడీ, అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు, రిక్షావోడు, ముఠామేస్ర్తీ, ఘరానా మొగుడు, అన్నయ్య తదితర సినిమాల్లో చిరు మార్క్ కామెడీకి అభిమానుల గోలతో థియేటర్లు దద్దరిల్లి పోయాయి.
– షాడోను గుర్తు తెప్పించాడు..
ఒకప్పటి సూపర్ హిట్ మూవీ రౌడీ అల్లుడులో చిరంజీవి చెప్పిన హిందీ డైలాగులు, తెలంగాణ యాస సూపర్ హిట్టయ్యాయి. ముంబైలో టాక్సీవాలా చిరు చెప్పిన హిందీ డైలాగులు, తెలంగాణ యాస అప్పట్లో జనాల్లో మార్మోగాయి. అదే మ్యాజిక్ ను భోళాశంకర్ లో రిపీట్ చేయాలని మెహర్ రమేష్ భావించి తడబడ్డాడు. భోళాశంకర్ లో చిరు తెలంగాణ యాస ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నది. ఇక పవన్ కల్యాణ్ ఫ్యాన్‌లా చిరు నటించడం, ఖుషీ సీన్ రీ క్రియేట్ చేయాలనుకొని పొరపాటు పడ్డాడు దర్శకుడు. శ్రీముఖితో చేయించింది కామెడీ అనుకోవడం మహాదారుణం అంత కంటే ఘోరం, విక్టరీ వెంకటేష్ హీరోగా మెహర్ రమేశ్ తీసిన షాడో సినిమాను కొన్ని సీన్లు తలపించాయి. షాడోలోనూ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ సీన్ ను మక్కీకి మక్కీకి దించేశాడు. బిల్లా స్విమ్మింగ్ ఫూల్ సీన్ కూడా అలాగే ఉంటుంది. భోళా శంకర్లో చిరు చేసిన సీన్లు షాడో సినిమాను గుర్తుకు తెస్తున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు.
– మాస్ బేస్ సరిపోలేదు.
మాస్ కు పక్కా పదం చిరంజీవి. అలాంటి చిరంజీవిలోని మాస్ ఎలివేషన్స్ చూపించడంలో మెహర్ రమేష్ పూర్తిగా తడబడ్డాడు. మాస్ లో ఎవరెస్ట్ శిఖరం లాంటి చిరంజీవిని కొండపై కూర్చోబెట్టినట్లుంది భోళాశంకర్. బాసూ సరిపోలేదు.. డోసూ అంటూ అభిమానలు నొసలు చిట్లిస్తున్నారు
-అజయ్ యాదవ్