Natyam Movie: ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటిస్తూ నిర్మించిన సినిమా ‘నాట్యం ’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా… ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ‘నాట్యం’ సినిమాకు ప్రశంసలు అందించారు. ‘నాట్యం’ సినిమా చాలా చక్కగా ఉండి… మంచి ఫీలింగ్‌ను కలిగించిందన్నారు.

నాట్యం అంటే ఓ కథను అందంగా, దృశ్యరూపంలో చూపించడం. నాట్యం అంటే కాళ్లు, చేతులు లయబద్దంగా ఆడించడం అనుకుంటారు. కానీ దర్శకుడు రేవంత్, సంధ్యా రాజు మాత్రం కథను అందంగా చెప్పడం అని చూపించారని వారిని అభినందించారు.
కె.విశ్వనాథ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను తీసినట్టు అనిపిస్తోందని చిరు అన్నారు. మన కళలు, నాట్యం, సంగీతంపై ఆయన కున్న గ్రిప్, ప్యాషన్ అంతా ఇంతా కాదన్నారు. ఇప్పుడు రేవంత్ అలాంటి ప్రయత్నం చేయడం ఆనందంగా ఉందని … మన ఆచారాలు, సంప్రదాయాలు, కళలను మరిచిపోతున్న ఈ తరంలో ఇలాంటి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని చెప్పారు.
ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు చిరు. ఇండస్ట్రీని ‘శంకరాభరణం’కు ముందు ‘శంకరాభరణం’ తరువాత అని అంటుంటారు. అలానే నాట్యం సినిమాకు కూడా ప్రజాశీస్సులు దక్కుతాయని ఆశిస్తున్నా అని మెగాస్టార్ చెప్పడం విశేషం. చిరంజీవి గారు మా సినిమాని సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది నటి సంధ్య రాజు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.