Mega Power Star: ‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..’ మెగాస్టార్ వారసుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి.. ఈ రోజుతోటి 14 ఏళ్ళు. ‘చిరుత’గా వచ్చి.. ‘మగధీర’తో తెలుగు సినీ పరిశ్రమ రికార్డులను అవార్డులను తిరగరాసి మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక స్టార్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు. కాగా చరణ్ తన 14 యేళ్ల నటనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా రామ్ చరణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను విశేషాలను చూద్దాం.

చరణ్.. 1985 మార్చి 27న చెన్నైలో జన్మించారు. చిన్న తనంలో సినిమాలకు దూరంగా ఉన్నా.. తండ్రి పెంపకంలో నటన పై ఆసక్తి, డ్యాన్స్ పై మక్కువ చరణ్ కి కలిగాయి. ఆ ఆసక్తి మక్కువే తండ్రికి తగ్గ తనయుడిగా మెగాస్టార్ కి నట వారసుడిగా చరణ్ ను నిలబెట్టాయి.
చరణ్ మొదటి సినిమాను వైజయంతి మూవీస్ నిర్మించింది. ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ కి మెగాస్టార్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం కారణంగానే చిరంజీవి అల్లు అరవింద్ ను కాదు అని, తన వారసుడిని అశ్వనీదత్ కి అప్పగించారు. అందుకు తగ్గట్టుగానే అశ్వనీదత్ కూడా ‘చిరుత’ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున సినిమాని అద్భుతంగా మలిచారు.
ఇక చరణ్ రెండో సినిమా విషయంలో చాలా చర్చ జరిగింది. నిజానికి చరణ్ మొదటి సినిమాని చేయమని మొదట రాజమౌళిని పిలిచి అడిగారు చిరు. మొదటి సినిమా చేయలేను, రెండో సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడు రాజమౌళి. ఆ మాట నిలబెట్టుకుంటా చేసిన సినిమానే ‘మగధీర’.
ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసిన ఆ సినిమా రామ్ చరణ్ ను మెగా పవర్ స్టార్ ను చేసింది. ఇక అప్పటి నుంచి కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా తనను తాను మార్చుకుంటూ చరణ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ మధ్యలో చరణ్ నటన పై లుక్ పై చాలా విమర్శలు వచ్చాయి. ఓ దశలో నిజమైన మెగా వారసుడు కాదు అన్నారు. కొంతమంది అసలు నటుడే కాదన్నారు. కానీ రంగస్థలంతో చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు చరణ్.
ఇక చరణ్ కి ఇండస్ట్రీలో ఉన్న మరో పేరు ‘మంచివాడు, మంచి విలువులు ఉన్నవాడు’. అందుకే, చరణ్ ను సినిమా వాళ్ళు నెత్తిన పెట్టుకుని గౌరవిస్తారు. ప్రస్తుతం చరణ్ తన సినీ కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు. ఇంకా చరణ్ ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుందాం.