Nagababu : మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) ఒక క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లో మంచి సక్సెస్ ని చూసిన సంగతి తెలిసిందే. హీరోగానే వెండితెర అరంగేట్రం చేశాడు కానీ, ఎందుకో ఆయన్ని అభిమానులు స్వీకరించలేకపోయారు. దీంతో మెగాస్టార్ తమ్ముడు అయినప్పటికీ, కేవలం హీరో గానే ఉండిపోవాలనే లైన్ గీసుకోకుండా, క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని కొనసాగించాడు. ఇప్పుడంటే రాజకీయాల్లో బిజీ అయ్యాడు, త్వరలో మంత్రి కూడా కాబోతున్నాడు కాబట్టి సినిమాలకు బాగా దూరం అయ్యాడు కానీ, ఒకప్పుడు ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాలో నాగబాబు కచ్చితంగా ఉండేవాడు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాల్లోనే కాకుండా ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ సినిమాల్లో కూడా నాగబాబు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం సినీ నటుడిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా ఆయన ఎన్నో మంచి సినిమాలను తీసాడు. మెగాస్టార్ చిరంజీవి తో ఆయన నిర్మించిన ‘రుద్రవీణ’ చిత్రం నేషనల్ అవార్డుని కూడా అందుకుంది.
అయితే నిర్మాతగా ఆయన్ని చావు దెబ్బ కొట్టిన సినిమా ఏదైనా ఉందా అంటే, అది రామ్ చరణ్(Ram Charan) తో తీసిన ‘ఆరెంజ్'(Orange Movie) చిత్రమే. ‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమా కోసం చేసిన అప్పులు తీర్చలేక నాగబాబు ప్రాణాలను తీసుకోవాలనే ప్రయత్నాలు చేసిన విషయాన్నీ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అలాంటి సినిమాని రీ రిలీజ్ చేస్తే బంపర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. మొదటి రీ రిలీజ్ లో ఈ చిత్రానికి ఏకంగా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు వాలెంటైన్స్ డే ని పురస్కరించుకొని రెండవసారి రీ రిలీజ్ చేస్తే, రెండవసారి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఫుల్ రన్ ముగిసే సమయానికి రెండు కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా నాగబాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘రామ్ చరణ్ కి మగధీర లాంటి హిట్ తర్వాత మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయాననే బాధ నాలో ఉండేది. అప్పటి ఆడియన్స్ కి ఇప్పటి ఆడియన్స్ కి చాలా తేడా వచ్చింది. జనరేషన్ మారిపోయింది, అందుకే ఆడియన్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇంతలా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి రామ్ చరణ్ కెరీర్ లో ఈ చిత్రం క్లాసిక్ గా నిలిచినందుకు ఆనందంగా ఉంది. నిర్మాతగా నేను ఫెయిల్యూర్ ని..అందుకే 2010 తర్వాత నిర్మాతగా వ్యవహరించడం వదిలేసాను. నాకంటే మా అమ్మాయి బెస్ట్ నిర్మాత’ అంటూ చెప్పుకొచ్చాడు.