
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నిక.. ఏకగ్రీవం చేద్దామని చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అయ్యేలా కనిపించట్లేదు. తాజాగా బాలకృష్ణ, నాగబాబు వేర్వేరుగా చేసిన కామెంట్లు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుత్వంతో చర్చలకు తనను పిలవలేదని ఆ మధ్య అలిగిన బాలకృష్ణ.. తాజాగా మరోసారి అదేవిధమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వంతో రాసుకొని తిరుగుతున్నారని, స్పెషల్ క్లాసులో అమెరికా వెళ్లివచ్చారని , ఆ డబ్బులు ఏమయ్యాయో చెప్పాలని అన్నారు. కరోనా కాలంలో షూటింగుల విషయమై చిరంజీవి, నాగార్జున వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. బాలకృష్ణ చేసిన కామెంట్లు మెగాస్టార్ ను ఉద్దేశించే అని అందరూ అనుకున్నారు. ఇదే సమయంలో మా ఎన్నికల గురించి కూడా చెప్పుకొచ్చారు.
మా ఎన్నికల విషయంలో జరుగుతున్న రచ్చ సరికాదని అన్నారు. ఈ ఎన్నికలను తాను లైట్ తీసుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అనేది చాలా చిన్న సంస్థ అని అన్నారు. దీనికోసం తిట్టుకోవాల్సిన అవసరం లేదని, తాను ఆ స్థాయికి దిగజారనంటూ చెప్పుకొచ్చారు. అదే సమయంలో మంచు విష్ణుకు మద్దతు ఇస్తానని చెప్పడం గమనార్హం. మా సంస్థకు విష్ణు భవనం కడతాను అంటే.. తాను కూడా సహాయం చేస్తానని అన్నారు.
ఇదిలాఉంటే.. మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చకు దారితీశాయి. ఎన్నికల గొడవంతా ఎందుకని పెద్దలు ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఏకగ్రీవం అనేది సరికాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరగొద్దని, ఏకగ్రీవం చేయాలని ప్రయత్నించడం తప్పుడు ఆలోచన అన్నారు. ఎన్నికలు జరగాల్సిందేనని, అభ్యర్థులు పోటీలో ఉండాలని అన్నారు. తద్వారా.. వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని చెప్పారు.
మా సంస్థను అభివృద్ధి చేసేందుకు ప్రకాశ్ రాజ్ మంచి విజన్ తో వచ్చారని, ఆయన చెప్పిన ప్లానింగ్ చాలా బాగుందని, అందుకే మద్దతు ఇస్తున్నామని అన్నారు. అదే సమయంలో మంచు విష్ణుపైనా సెటైర్ వేశారు. మా సంస్థ కోసం బిల్డింగ్ కడతానని చెబుతున్నారని, మరి.. స్థలం ఎక్కడ ఉందో? ఎక్కడి నుంచి తెస్తారో చెబితే బాగుండేదని అన్నారు. ‘మా’ గొడవలు రెండు నెలలు ఉండిపోతాయని, ఇదంతా టీ కప్పుల్లో తుఫాను వంటిదని అన్నారు. దీంతో.. ఎన్నిక ఏకగ్రీవం అనేది సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.