Sankranthiki Vastunnam: విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో, రికార్డు స్థాయి వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ నటనతో పాటు, ఈ సినిమాలోని మిగిలిన నటీనటులు కూడా ఎంతో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఎప్పటిలాగానే ఈ సినిమాలో కూడా తన నటనతో దుమ్ము లేపేసింది. ఊహంచని విషయం ఏమిటంటే మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా మంచి యాక్టింగ్ చేసింది. కామెడీ, ఫైట్స్ ఈ అమ్మాయి ఈ రేంజ్ లో చేస్తుందని అంతకు ముందు ఎవ్వరూ ఊహించలేదు. అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడి ముందుగా మీనాక్షి చౌదరి తో ఆ పాత్ర చేయించాలని అనుకోలేదట. ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీలీల తో ఆ పాత్రని చేయించాలని అనుకున్నాడట.
శ్రీలీలతో గతంలో ఆయన ‘భగవంత్ కేసరి’ చిత్రం చేసాడు. ఈ అమ్మాయికి కేవలం డ్యాన్స్ తప్ప యాక్టింగ్ రాదు అని అనుకున్న ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక సమాధానం గా నిల్చింది. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ఎదురుకుంటున్న శ్రీలీల ఖాతాలో ఒక హిట్ చిత్రంగా చేరింది ఈ సినిమా. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి శ్రీలీల డేట్స్ అడిగాడట అనిల్ రావిపూడి. కానీ ఈ సినిమా షూటింగ్ సమయానికి తాను కోరుకున్న సమయంలో డేట్స్ ఇవ్వలేనని, MBBS ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలని చెప్పిందట. దీంతో ఆమె స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చింది. ఒకవేళ ఈ సినిమాని ఒప్పుకొని శ్రీలీల చేసుంటే, కచ్చితంగా ఆమె కెరీర్ కి బాగా ప్లస్ అయ్యేది. ఎందుకంటే ఆమె ధమాకా వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా అరడజనుకు పైగా సినిమాలు చేస్తే అందులో కేవలం ‘భగవంత్ కేసరి’ మాత్రమే సక్సెస్ అయ్యింది.
ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘గుంటూరు కారం’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. దీంతో శ్రీలీల కి ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ప్రస్తుతం ఆమె చేతిలో రవితేజ ‘మాస్ జాతర’, నితిన్ ‘రాబిన్ హుడ్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు చిత్రాలతో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా హిట్ అయితే ఆమె దశ తిరిగిపోయినట్టే. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చేసుంటే శ్రీలీల కెరీర్ లో నటన పరంగా మరో అద్భుతమైన సినిమా ఉండేదని ఆమె అభిమానులు అంటున్నారు. అంతే కాకుండా ఆమె ఈ చిత్రం లో ఉంది కాబట్టి ‘కుర్చీ మడతపెట్టి’ లాంటి ఊరమాస్ డ్యాన్స్ నెంబర్ ని కూడా డైరెక్టర్ డిజైన్ చేయించేవాడు అంటూ చెప్పుకొచ్చారు.