బుల్లితెరలో కూడా హీరోల ప్రాతినిధ్యం పెరుగుతోంది. గతంలో నాగార్జున, చిరంజీవి లాంటి అగ్రహీరోలే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను పలకరించగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సైతం తన వాణిని వినిపించబోతున్నారు. ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు తాజాగా ప్రేక్షకులను కనువిందు చేయనుంది. బుల్లితెర రేటింగ్ పెంచుకోవడంలో ఆయా చానళ్లు పోటీ పడడం తెలిసిందే. అందుకే ఈ కార్యక్రమం రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.
హూ వాంట్స్ టు బికమ్ ఏ మిలియనీర్ కార్యక్రమం ఆధారంగా భారతదేశంలో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం మొదలైంది. అమితాబచ్చన్ యాంకర్ గా ఈ ప్రోగ్రాం సూపర్ హిట్ కావడంతో దీన్ని అన్ని భారతీయ భాషల్లో ప్రసారం చేశారు. తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నాగార్జున వ్యాఖ్యాతగా మూడు సీజన్లు చేశారు. కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం ఇన్ని రోజులు వాయిదా పడింది. ప్రస్తుతం మళ్లీ తెరమీదకు వస్తోంది. దీంతో దీనిపై యాజమాన్యం పెద్ద ఆశలే పెట్టుకుంది.
నాలుగో సీజన్ కు వ్యాఖ్యాతగా చిరంజీవి వ్యవహరించినా అప్పుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వ్యవహారంతో మరుగునపడిపోయింది. ఈ నేపథ్యంలో జనానికి మొహం మొత్తినా జూనియర్ ఎన్టీఆర్ ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. టీఆర్పీ రేటింగ్ పెంచుకునే క్రమంలో జెమినీ టీవీ ఎంత మేరకు ఫలితం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.
మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం మొదటి సీజన్ నుంచి సూపర్ హిట్ అయిన తరువాత గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. బిగ్ బాస్ ప్రోగ్రాం మాత్రం దీనికి వ్యతిరేకంగా మొదటి సీజన్ నుంచి గ్రాఫ్ పెంచుకుంటూ సూపర్ హిట్ అయింది. అయితే ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ కే ఆకర్షణ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 5 వచ్చినా అదేవిధంగా ఆదరిస్తారని సమాచారం. తెలుగు టెలివిజన్ రంగంలో హీరోలను యాంకర్లుగా పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు జరగడం ఆహ్వానించదగినదే.