Naga Chaitanya: డిసెంబర్ 4న నాగ చైతన్య వివాహం. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆయన ఏడడుగులు వేయనున్నారు ఇప్పటికే నాగార్జున నాగ చైతన్య వివాహం పై అధికారిక ప్రకటన చేశాడు. అన్నపూర్ణ స్టూడియోలో కొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరగనుందని చెప్పారు. ఏఎన్నార్ జయంతి వేడుక జరిగిన ఏడాదే, ఆయనకు ఇష్టమైన అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య వివాహం జరగడం సంతోషకరం అని నాగార్జున అన్నారు.
కాగా శోభితతో వివాహం పై నాగ చైతన్య ఎన్నడు మాట్లాడలేదు. శోభితతో రిలేషన్ లో ఉన్నాడన్న వార్తలను కూడా నాగ చైతన్య ఖండించలేదు. మీడియాలో వస్తున్న కథనాలపై ఆయన టీమ్ స్పందిస్తూ ఉండేది. ఎట్టకేలకు నాగ చైతన్య నోరు విప్పారు. ఈ క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మా పెళ్లి నిరాడంబరంగా, సాంప్రదాయబద్దంగా జరుగుతుంది. ఎలాంటి హడావుడికి తావు లేదు. గెస్ట్ లిస్ట్స్ , ఇతర పనులు దగ్గరుండి మేమే చేసుకున్నాము.
అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకం. తాత గారి విగ్రహం ఎదుటే మా పెళ్లి జరపాలని ఇరు కుటుంబాల పెద్దలం నిర్ణయించుకున్నాం. తాత ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. శోభితతో కొత్త జీవితం ఆరంభించేందుకు ఆశగా ఎదురు చూస్తున్నాను. ఆమె నాతో ఎంతో కనెక్ట్ అయ్యింది. ఆమె నన్ను బాగా అర్థం చేసుకుంది. జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని పూడ్చేందుకు ఈ వివాహం చేసుకుంటున్నాను.. అని నాగ చైతన్య ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
శోభితతో నాగ చైతన్య రెండేళ్లకు పైగా రిలేషన్ లో ఉన్నాడు. ఈ జంట విదేశాల్లో విహరిస్తున్న ఫోటోలు రెండు మూడు సందర్భాల్లో వైరల్ అయ్యాయి. అయినప్పటికీ ఎఫైర్ రూమర్స్ ఖండించారు. ఆగస్టు 8న నాగార్జున నివాసంలో ఎంగేజ్మెంట్ జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక ముగించారు. శోభిత ధూళిపాళ్ల తెలుగు అమ్మాయే కాగా.. మోడల్ గా కెరీర్ ఆరంభించింది. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ చిత్రాల్లో ఆమె నటించారు. తెలుగులో శోభిత గూఢచారి, మేజర్ చిత్రాల్లో నటించారు. గూఢచారి 2లో సైతం శోభిత నటిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నాడు. ఎమోషనల్ లవ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సాయి పల్లవి హీరోయిన్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.