Mansoor Ali Khan: తమిల నటుడు మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై గతంలోనే ఆరోపణలు చేసి ఫేమస్ అయ్యారు. అంతకు ముందు కూడా ఎన్నో సినిమాల్లో నటించిన ఈ నటుడు త్రిషపై ఆరోపణలు చేసి ఎంతో మందికి పరిచయం అయ్యారు. అయితే ఈ విషయం గతంలోనే ఎన్నో ఇండస్ట్రీలలో మారుమోగిపోయింది. చాలా మంది త్రిషకు మద్దతుగా కూడా నిలిచారు. ఇక లియో సినిమాలో హీరోయిన్ త్రిష అని తెలిశాక బెడ్ రూమ్ సీన్ ఉంటుందని ఆశపడ్డానని, కానీ అది జరగలేదంటూ నెగటివ్ గా వ్యాఖ్యానించారు.
ఇందులో అశ్లీల ధ్వనికి హీరోయిన్ త్రిష స్పందించింది. తనతో మరో సినిమాలో నటించేది లేదని తేల్చి చెప్పేసింది. ఈ వివాదంపై చిరంజీవి, ఖుష్బూ వంటి పలువురు తారలు త్రిషకు మద్దతుగా నిలిచారు. అయితే తన మాటల్లో ఎక్కడ తప్పుందని.. తప్పు లేకున్నా తప్పుపడుతున్నారంటూ కామెంట్లు చేశారు మన్సూర్ అలీ. త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన చిరంజీవి, ఖుష్బూలపై కూడా పరువు నష్టం దావా వేశారు. ఈ వ్యవహారంలో తాను అమాయకుడు అని, తనకు ముగ్గురి నుంచి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం రావాలని పిటిషన్ వేశారు.
ఈయన వ్యవహారం పరిశీలించిన కోర్టు మన్సూర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన మన్సూర్ ఇతరులపై పరువు నష్టం దావా వేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు కోర్టు సమయం వృథా చేసినందుకు చెన్నై లో అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు రూ. 1 లక్ష చెల్లించాలంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇదంతా జరిగి నెల రోజులు గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా ఆ రుసుమును కట్టలేదు మన్సూర్. వారం రోజుల కిందట కోర్టు గుర్తు చేసినా మరో పది రోజుల గడువు కావాలన్నాడు.
చివరి వరకు కూడా ఆ డబ్బును చెల్లించకుండా ఉండడానికి ప్రయత్నాలు చేశారట. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీలుకు దరఖాస్తు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన న్యాయస్థానం స్టే విధించడాన్ని నిరాకరించింది. డబ్బు కడతాను అని అంగీకరించి తీర్పును ఎలా వ్యతిరేకిస్తారు అంటూ ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఎదుటే ఏ విషయమో తేల్చుకోవాలని చీవాట్లు పెట్టింది. దీంతో తదుపరి విచారణ 7కు వాయిదా పడింది. మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.