Manchu Vishnu and Allu Arjun : గత ఏడాది చివర్లో సంధ్య థియేటర్ ఘటన, దానిని అనుసరిస్తూ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం, ఆ తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు రావడం వంటి అంశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అభిమానులు ఈ ఘటనపై ఎంత ఆందోళనకు గురి అయ్యారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుమారుడు ఇంకా కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నాడు. సినీ పరిశ్రమ మొత్తం హాస్పిటల్ కి వెళ్లి శ్రీతేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అల్లు అర్జున్ కూడా ప్రత్యేక పోలీసు అనుమతితో శ్రీతేజ్ ని గత నెలలో పరామర్శించాడు. శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ మరియు పుష్ప మూవీ టీం కలిసి రెండు కోట్ల రూపాయలకు పైగా ఆర్థికసాయం అందించారు. భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా ఆదుకుంటామని ఆ కుటుంబానికి భరోసా ని అందించారు. అయితే ఈ ఘటన ప్రభావం ఇండస్ట్రీ పై చాలా బలంగా పడింది.
రీసెంట్ గా మోహన్ బాబు తనయుడు, ప్రముఖ హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఈ విషయం పై స్పందించాడు. సంధ్య థియేటర్ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటని యాంకర్ అడిగిన ప్రశ్నకు మంచు విష్ణు సమాధానం చెప్తూ ‘ఇలాంటి ఘటన జరగడం అత్యంత బాధాకరం. సెలెబ్రిటీలు కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూసుకోవాలి. అల్లు అర్జున్ గారి అరెస్ట్, ఆ తర్వాత ఆయన బెయిల్ మీద బయటకి రావడం వంటివి కేవలం అతని కుటుంబాన్ని మాత్రమే కాదు, ఇండస్ట్రీ పై ప్రభావం చూపించింది. భవిష్యత్తులో ఇక మీదట సినిమా హీరోలు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసే అవకాశం కూడా ఇక కోల్పోయినట్టే. ఇక నుండైనా హీరోలు జాగ్రత్తగా ఉండాలి’ అంటూ ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
ఇదంతా పక్కన పెడితే మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నాడు. సుమారుగా 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నాడు. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ లతో పాటు ఎంతో మంది ప్రముఖులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్షయ్ కుమార్ శివుడి పాత్ర పోషిస్తుండగా, రెబల్ స్టార్ ప్రభాస్ నంది క్యారక్టర్ చేస్తున్నాడు. ఆయన పాత్ర సినిమాలో 25 నుండి 30 నిమిషాల వరకు ఉంటుందట. పార్వతి క్యారక్టర్ లో క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కనిపించనుంది.