Vishnu Manchu- Karate Kalyani: ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు వివాదం.. కరాటే కళ్యాణికి మా అధ్యక్షుడు మంచు విష్ణు భారీ షాక్!

కరాటే కళ్యాణి పోరాటంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సీరియస్ అయ్యింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు.

Written By: Shiva, Updated On : May 18, 2023 6:52 pm

Vishnu Manchu- Karate Kalyani

Follow us on

Vishnu Manchu- Karate Kalyani: ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై నటి కరాటే కళ్యాణి తీవ్ర అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఆమె తప్పుబడుతున్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో మే 28వ తేదీన విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ని పువ్వాడ అజయ్ ఈ కార్యక్రమానికి స్వయంగా ఆహ్వానించారు.

అయితే శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ తగదని కరాటే కళ్యాణి పోరాటం చేస్తున్నారు. యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షురాలిగా ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. శ్రీకృష్ణుడు అవతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం భగవాన్ శ్రీకృష్ణుడిని కించ పరచడమే. ఇది యాదవుల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తీస్తుందని, ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కరాటే కళ్యాణి పోరాటంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సీరియస్ అయ్యింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. మా పాలక వర్గాన్ని సంప్రదించకుండా ఆమె ఈ కార్యక్రమం చేపట్టడంపై మా గుర్రుగా ఉంది. కాగా గత ఎన్నికల్లో కరాటే కళ్యాణి మంచు విష్ణు ప్యానెల్ తరపు నుండే పోటీ చేశారు.

మరి మంచు విష్ణు నోటీసులపై కరాటే కళ్యాణి ఎలా స్పందిస్తుందో చూడాలి. అఖిల భారత యాదవ సమితి కూడా ఈ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని వారు ఖండిస్తున్నారు. మే 28న ఏర్పాటు కార్యక్రమం ఉండగా… ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. మరోవైపు మే 20న టీడీపీ శత జయంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్ లో సభ ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా ఆహ్వానించారు.