Mohan Babu: మోహన్ బాబు మాటల్లో రెండు అర్థాలు ఉంటాయి. ఆయన ఏమి మాట్లాడినా అందులో చాలా విషయాలు ఉంటాయి. అయితే, తాజాగా ఇచ్చిన ఓ స్పీచ్ లో కూడా అనేక భావాలు ఉన్నాయి. ఆ అర్థాల్లో ఆ భావాల్లో ఎన్నో అనుమానాలు. మరెన్నో వార్నింగ్ లు. ఇంతకీ మోహన్ బాబు మాటలను పరిశీలిస్తే.. ‘ఏదైనా భగవంతుడు, కాలం నిర్ణయిస్తుంది. అంతా నాదే అనుకుంటాం. కానీ, మన చేతుల్లో ఏమీ లేదు. భగవంతుని నిర్ణయం ప్రకారం ఇదంతా జరిగింది’ ఇలా సాగింది ఆయన స్పీచ్.

కానీ అంతలోనే ’17వ సంవత్సరాల క్రితం నేను ‘మా’ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాను. అక్టోబర్ 10వ తేదీనే. మళ్ళీ ఇప్పుడు విష్ణు బాబు కూడా ఇదే తేదీన గెలిచాడు ? మరి దీనిని ఏమంటాం’ అంటూ ఇది అంతా తన గొప్పతనమే అన్న రేంజ్ లో ఆయన భావాలు సాగాయి. అంతలో పక్కన నరేష్ మోహంలో ఎక్స్ ప్రెషన్స్ మారిపోతున్నాయి. అది గమనించి మోహన్ బాబు ‘ఇది అందరి విజయం’ అంటూ నరేష్ వైపు చూశారు.
నరేష్ ఆనందంతో చిన్నపిల్లాడిలా లోలోపల తెగ సంతోష పడిపోయాడు. ఇక అంతలో మోహన్ బాబుకి ఏవో గుర్తుకు వచ్చాయి. దాంతో ఆయన ఒక్కసారిగా రెచ్సిపోతూ.. ‘నేను మాట్లాడాల్సి వస్తే మాట్లాడడానికి చాలా ఉంది’ అంటూ మొదలుపెట్టారు. మీడియా ప్రతినిధులు అలెర్ట్ అయ్యారు. కానీ అంతలో మోహన్ బాబు ‘మీడియాకి తెలియని విషయాలు కాదు’ అంటూ పక్క చూపులు చూశారు.
ఆశ పడిన మీడియా భంగపడింది. ఏదో కాంట్రవర్సీ డైలాగ్ లు వదులుతాడు అనుకుంటే.. లేనిపోని బిల్డప్ డైలాగ్ లతోనే టైం పాస్ చేస్తున్నాడు ఏమిటి ? అంటూ మీడియా ప్రతినిధులు నీరసంగా చూస్తున్నారు. ఆ చూపులు గమనించిన మోహన్ బాబు మళ్ళీ టోన్ మార్చారు. ‘సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందీ అంటే.. ఆలోచించుకోవడానికే’ అంటూ భారీ డైలాగ్ లు మొదలుపెట్టారు.
‘సముద్ర కెరటం ఓ.. అని ఉప్పొంగుతుంది.. అది వెనక్కి వెళ్లింది కదా అని అజాగ్రత్తతో ఉంటే.. సునామీ రాగలదు’ అంటూ పుస్తకంలో కొటేషన్స్ చెప్పుకుంటూ పోతున్నాడు మోహన్ బాబు. ఇలా చాలా విషయాలు చెప్పి.. చివరకు ‘పీవీ నరసింహారావుగారు ఎక్కడున్నారో’ అనేసరికి అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ‘ఆయన భారత ప్రధానిగా ఉన్నప్పుడు, నేను రాజ్యసభ మెంబర్‌గా ఉన్నాను’ అని ఆ తర్వాత ఏదో చెప్పారు. మొత్తానికి మోహన్ బాబు స్పీచ్ ఇలా ముగిసింది. మొత్తమ్మీద సింహం – సముద్ర కెరటం.. మధ్యలో మోహన్ బాబు తప్ప ఎవరికీ ఏమి అర్ధం కాలేదు.