Mega Heroes : గత కొంత కాలంగా మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు, అన్నయ్య విష్ణులపై పెద్ద పోరాటం చేస్తున్న విషయాన్ని మనమంతా గమనిస్తూనే ఉన్నాం. ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా పరిష్కరించుకోవాల్సిన సమస్యలు వీడికి మీదకు తీసుకొచ్చి ఒకరిపై ఒకరు కేసులు వేసుకునే స్థాయికి చేరుకున్నారు. మనోజ్ కి తన అక్క మంచు లక్ష్మి తప్ప, కుటుంబ సభ్యులు మొత్తం రివర్స్ అయ్యారు. చివరికి సపోర్టుగా ఉంది అనుకున్న మనోజ్ తల్లి కూడా అతని చర్యలను వ్యతిరేకిస్తూ లేఖ రాసింది. తనకి ఇంట్లో జరుగుతున్న అన్యాయం పై ప్రెస్ మీట్ పెట్టి జనాలకు పూసగుచ్చినట్టు చెప్తానని మీడియాతో చెప్పిన మనోజ్, ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ తన ప్రెస్ మీట్ ని రద్దు చేసుకున్నాడు. అయితే కుటుంబానికి దూరంగా తన స్నేహితులతో కలిసి నిన్న ఆయన సంక్రాంతి సంబరాలు చేసుకున్నాడు. దానికి సంబంధించి సోషల్ మీడియా లో ఆయన పెట్టిన ఒక ఫోటో బాగా వైరల్ అయ్యింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మై చిట్టి తల్లి మొట్టమొదటిసారి గాలిపటాన్ని ఎగరవేసిన అనుభూతిని పొందింది. సొంత కుటుంబ సభ్యులు లాంటి నా స్నేహితులతో కలిసి ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన అప్లోడ్ చేసిన ఫొటోలో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, సీనియర్ హీరో నరేష్ కొడుకు విజయ్ కృష్ణ వంటి వారు కూడా ఉన్నారు. మనోజ్ కి ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం అందరికి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ ఎత్తుకున్న ఆ చిన్నారి మరెవరో కాదు, మనోజ్ కూతురు. మనోజ్ భార్య భూమా మౌనిక కూడా ఈ ఫొటోలో ఉంది. తనకి నచ్చిన చోట సంతోషంగా గడుపుతున్న మనోజ్ ని చూసి ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు.
కొంతకాలం వరకు సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చిన మనోజ్, ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. తేజ సజ్జ హీరో గా తెరకెక్కుతున్న ‘మిరాయ్’ చిత్రంలో విలన్ గా నటిస్తున్న మనోజ్, బెల్లం కొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ లతో కలిసి ‘భైరవం’ అనే చిత్రం లో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ‘మిరాయ్’ చిత్రం లో ఆయన పాత్రకి సంబంధించిన టీజర్ కి ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో మనోజ్ దుమ్ములేపేలా ఉన్నాడే అనే కామెంట్స్ కూడా బలంగా వినిపించాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఈ ఏడాది ద్వితీయార్థం లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలతో పాటు , హీరో గా కూడా ఆయన పలు చిత్రాలు చేయడానికి సంతకాలు చేసాడు.