రోటీన్ కు భిన్నంగా సినిమాలు తీసే హీరో ‘అడవి శేష్’. అతడి సినిమాల్లో ఏదో కొత్తదనం ఉంటుంది. ఆ కొత్తదనంతో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా నిలదొక్కుకున్నాడు. థ్రిల్లర్, యాక్షన్ సినిమాల ఫేవరెట్ గా మారాడు.
తాజాగా అడవి శేష్ మరోసారి సరికొత్త పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి ‘మేజర్’ గా మారి తెలుగులోనే కాదు.. హిందీ సహా దక్షిణాది భాషల్లో ఎంట్రీ ఇస్తూ ప్యాన్ ఇండియా మూవీని తీశాడు.
ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్ శశికిరణ్ తెరకెక్కించాడు.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది.
టీజర్ గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది. ‘మన సరిహద్దుల్లో ఆర్మీ ఎలా యుద్ధం చేయాలి? ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎలా గెలవాలి? అని అందరూ ఆలోచిస్తారు. అదీ దేశభక్తే.. దేశాన్ని ప్రేమించడం అందరి పని.. వాళ్లను కాపాడడం సైనికుడి పని’ అంటూ అడవి శేష్ చెబుతున్న డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ మూవీని మహేష్ బాబు నిర్మిస్తున్నారు. సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
ఈ తెలుగు టీజర్ ను హీరో మహేష్ బాబు, హిందీ టీజర్ ను సల్మాన్ ఖాన్, మలయాళం టీజర్ ను ఫృథ్వీరాజ్ విడుదల చేశారు.