Mahindra: దేశీయ ఎస్యూవీ దిగ్గజం మహీంద్రా తన లైనప్‌ను మరింత బలోపేతం చేయడానికి రెడీ అవుతుంది. కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన, ఎక్కువ కాలం నుంచి అమ్ముడవుతున్న SUV బొలెరోను సరికొత్త లుక్కులో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా, ఆఫ్-రోడింగ్ ప్రేమికుల ఫేవరెట్ థార్, ప్రీమియం SUV XUV700 కూడా త్వరలో ఫేస్‌లిఫ్ట్ అవతార్‌లో మెరిపించనున్నాయి. ఈ మూడు SUVలలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? ఎప్పుడు విడుదల కానున్నాయి? వివరంగా తెలసుకుందాం.
Also Read: భూమిపై కూలనున్న ‘కాస్మోస్ 482’.. అసలేంటిది..?
మహీంద్రా బొలెరో
2000 సంవత్సరంలో విడుదలైన మహీంద్రా బొలెరో ఇప్పుడు సరికొత్త లుక్కులో రాబోతుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో పెద్ద మార్పులు చూడవచ్చు. అంతేకాకుండా, దీని పేరు కూడా మారే అవకాశం కనిపిస్తుంది. బొలెరో కొత్త వెర్షన్ మరింత ప్రీమియం, ఆధునిక డిజైన్‌తో అందించనున్నారు.తద్వారా ఇది కొత్త కస్టమర్లను కూడా ఆకర్షించగలదు.
మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్
మహీంద్రా థార్ 2020లో మళ్లీ రిలీజ్ చేశారు. ఇప్పుడు కంపెనీ దీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రెడీ చేస్తుంది. ఈ కొత్త మోడల్‌లో LED హెడ్‌ల్యాంప్‌లు, కొత్త రేడియేటర్ గ్రిల్, 18-అంగుళాల కొత్త అల్లాయ్ వీల్స్, ట్వీక్డ్ టెయిల్ ల్యాంప్‌లు, రిఫ్రెష్డ్ ఫ్రంట్, రియర్ బంపర్‌ల వంటి డిజైన్ అప్‌డేట్‌లు చూడవచ్చు. ఇంటీరియర్ విషయానికి వస్తే.. కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉండవచ్చు. అయితే, దీని ఇంజన్ లేదా పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఈ SUV ఇప్పటికీ ఆఫ్-రోడింగ్ ఇష్టపడేవారి ఫస్ట్ ఆప్షన్ గా కొనసాగుతుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ 2026లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
మహీంద్రా XUV700
మహీంద్రా ప్రీమియం SUV XUV700 కూడా 2026లో అప్‌డేట్ కానుంది. దీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కనెక్టెడ్ LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్‌లు, యాంబియంట్ లైటింగ్‌తో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, 12.3-ఇంచుల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్యాసింజర్ డిస్‌ప్లే చూడవచ్చు. XUV700 ఇప్పటికే టెక్నాలజీ, భద్రతా పరంగా చాలా లేటెస్ట్. ఈ కొత్త అప్‌డేట్ దానిని మరింత ప్రీమియంగా చేస్తుంది. అయితే, ఈ ఫేస్‌లిఫ్ట్‌లో కూడా ఇంజన్ సెటప్‌లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కూడా 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.
మహీంద్రా ఈ మూడు SUVలను కొత్త హంగులతో విడుదల చేయడానికి సిద్ధమవుతుండడంతో భారతీయ SUV మార్కెట్‌లో మరింత పోటీ నెలకొనే అవకాశం ఉంది. బొలెరో కొత్త అవతార్, థార్, XUV700ల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లు వినియోగదారులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.