Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం నిన్న గాక మొన్న మొదలైనట్టు అనిపిస్తుంది. కానీ అప్పుడే 50 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయట. ఈ సెప్టెంబర్ కి సినిమా మొత్తం పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మరియు పృథ్వి రాజ్ సుకుమారన్ కలిసి హాలీవుడ్ లో ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో వీళ్ళు ‘వారణాసి’ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి పని తనం గురించి, ఆయన పర్ఫెక్షన్ గురించి మహేష్ బాబు చెప్పిన మాటలు వింటే, ఇలాంటి డైరెక్టర్ ప్రపంచం లో ఎక్కడా ఉండదు అనిపిస్తుంది.
మహేష్ బాబు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ఒక సన్నివేశంలో నేను శ్రీరాముడి గెటప్ లో కనిపిస్తాను. కేవలం ఒకే ఒక్క షాట్ కోసం నా నడక, పరుగు, ఆహార్యం మొత్తం మార్చుకోవాల్సి వచ్చింది. అందుకోసం నేను ఏకంగా ఆరు నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ షాట్ ని చూసిన తర్వాత అన్ని నెలల శ్రమ అవసరమే అనిపించింది. అంత అద్భుతంగా తీర్చి దిద్దాడు. మొట్టమొదటిసారి నేను ఈ సినిమా కథ విన్నప్పుడు రాజమౌళి చెప్పిన ఐడియా చూసి నా మైండ్ బ్లాస్ట్ అయ్యింది. ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య తో మాట్లాడుతూ రాజమౌళి చెప్పిన ఆలోచన నన్ను వెంటాడుతూనే ఉందని అన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. భారత దేశం లోని మైథాలజీ, అడ్వెంచర్ జానర్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదని, థియేటర్స్ లో ఈ చిత్రం ఇచ్చే అనుభూతిని ప్రేక్షకులు కొన్నాళ్ల పాటు మర్చిపోలేరని చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.
ఇక రాజమౌళి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ‘ముందుగా ఈ సినిమాని మూడు భాగాలుగా, లేదా రెండు భాగాలుగా తియ్యాలని అనుకున్నాము. కానీ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఆ ఆలోచన ని విరమించుకున్నాము. ఈ చిత్రం కేవలం ఒక భాగం గానే తెరకెక్కుతుంది. సినిమా రన్ టైం మాత్రం 3 గంటలకు పైగానే ఉంటుంది ‘ అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఏప్రిల్ 7 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ఇప్పటి నుండే మొదలైంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక బయ్యర్ ఈ చిత్రాన్ని 18 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చాడు. కానీ మేకర్స్ 20 కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని 650 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.