Anil Sunkara: ఏజెంట్ సినిమాతో భారీగా నష్టపోయిన నిర్మాత అనిల్ సుంకర ఎలాగైనా బోళా శంకర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాలని ఉన్నాడు. అయితే ఎప్పుడో 2015లో తమిళంలో విడుదలైన వేదాళం సినిమాకి బోళా శంకర్ రీమేక్ కావడంతో ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే పెద్దగా లేవు. ఇక ఈ నిర్మాత చేసేది ఏమీ లేక తన భారం అంతా మెగాస్టార్ చిరంజీవి పైన వేసేసారు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలకు సిద్ధంగా ఉండడంతో నిర్మాత ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చిరంజీవి గురించి తనకు మహేష్ బాబు చెప్పిన మాటలు చెప్పి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.
నిర్మాత మాట్లాడుతూ ..మెగాస్టార్ చిరంజీవితో ఇంత త్వరగా సినిమా చేస్తానని తాను ఊహించలేదని అనిల్ సుంకర అన్నారు. కానీ, తన కల ఇప్పుడు నెరవేరుతోందని చెప్పారు. ‘నేను ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికే చిరంజీవి రాజకీయాల్లో ఉన్నారు. అలాంటప్పుడు సినిమా అనే ఆలోచన రాదు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వేడుక కోసం చిరంజీవిని ఆహ్వానించడానికి వెళ్లాం. ఆయన్ని తొలిసారి కలిసింది అప్పుడే. సరదాగా మాట్లాడుతూ.. ‘మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలని అనుకున్నానండీ ఫైనల్‌గా కలిశాను’ అని అన్నాను. అప్పుడు ఆయన ‘కలవడం ఏంటండీ? సినిమా చేస్తున్నాం’ అని అన్నారు. అలా చిరంజీవితో సినిమా ఆలోచన మొదలైంది’ అని చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా తమిళ సినిమా ‘వేదాళం’ కన్నడ రీమేక్ హక్కులను అనిల్ సుంకర కొనుగోలు చేశారట. మరోవైపు, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా గుంటూరు డిస్ట్రిబ్యూషన్ మెహర్ రమేష్ చేశారట. ఆ సమయంలో రోజూ కలుసుకునేటప్పుడు ‘వేదాళం’ చిరంజీవికి అయితే ఎలా ఉంటుందని మాట్లాడుకునేవాళ్లట. అలా ‘భోళా శంకర్’ జర్నీ మొదలైందని అనిల్ సుంకర చెప్పారు.
ఇక మహేష్ బాబు చిరంజీవి గురించి చెప్పిన మాటలు తెలుపుతూ..‘మహేష్ బాబుతో సినిమా షూట్ చేసేటప్పుడు నేను ప్రతిరోజు సెట్‌లో ఉంటాను. నాకు, మహేష్‌కి మధ్య ఆ బాండింగ్ ఉంటుంది. మిగతా సినిమా షూటింగులకు నేను ఉండను. భోళా శంకర్ చేసేటప్పుడు.. ‘ఒక హీరోగా చెబుతున్నా, ప్రతిరోజు మీరు సెట్‌లో ఉండాలి. నిర్మాత సెట్‌లో ఉంటే చిరంజీవి చాలా ఆనందపడతారు’ అని మహేష్ నాకు చెప్పారు. 120 వర్కింగ్ డేస్‌లో దాదాపు 40 రోజులు చింజీవితో ఉన్నాను. ఇది చాలా మెమరబుల్ జర్నీ. ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకున్నా. ఒక్క రోజు కూడా వృథా కాదు. చాలా ఎంజాయ్ చేశాను’ అని చెప్పుకొచ్చారు ఈ నిర్మాత.