Homeఎంటర్టైన్మెంట్Anees Ibrahim Madhuri Dixit: మాధురిపై మనసుపడ్డ దావూద్‌ సోదరుడు.. బాలీవుడ్‌లో చీకటి కథనాల్లో ఇదీ...

Anees Ibrahim Madhuri Dixit: మాధురిపై మనసుపడ్డ దావూద్‌ సోదరుడు.. బాలీవుడ్‌లో చీకటి కథనాల్లో ఇదీ ఒకటి!

Anees Ibrahim Madhuri Dixit: 1990వ దశకంలో బాలీవుడ్‌ను ఏలిన మాధురి దీక్షిత్‌ కేవలం తన నటనతోనే కాదు, తన అసాధారణ అందంతో, ముఖ్యంగా ఆమె నవ్వుతో కోట్లాది మందిని సమ్మోహితం చేసింది. ‘మధుబాల తర్వాత ఇంత అందమైన నవ్వు మరొకరికి లేదు‘ అని ఆమె గురించి అప్పట్లో ప్రముఖులు చెప్పుకునేవారు. కానీ, ఈ స్టార్‌డమ్‌ ఆమె ప్రాణాల మీదకు తెచ్చిన ప్రమాదం చాలామందికి తెలియని నిజం. ముంబై అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరుడు అనీస్‌ ఇబ్రహీం ఆమెను దుబాయికి రమ్మని పిలిచాడు. నిరాకరించినందుకు హత్యకు సుపారీ ఇచ్చిన ఘటన బాలీవుడ్‌ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం.

Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి

తనతో గడపాలని పిలుపు..
1990ల మధ్యకాలంలో మాధురి దీక్షిత్‌ కెరీర్‌ శిఖరాగ్రాన ఉంది. ఆ సమయంలో దావూద్‌ ఇబ్రహీం సోదరుడు అనీస్‌ ఇబ్రహీం ఆమెకు ఫోన్‌ చేసి, ‘దుబాయికి రా, కొంతకాలం నాతో గడుపు, తర్వాత వెళ్లిపో’ అని ప్రతిపాదన పంపాడు. ఇది కేవలం ఆహ్వానం కాదు, ఒక బెదిరింపు కూడా. ఆ రోజుల్లో దావూద్‌ గ్యాంగ్‌ పిలుపును తిరస్కరించడం అంటే ప్రాణాలతో ఆటలాడటమే. కానీ, మాధురి ధైర్యంగా ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. అనీస్‌ బతిమిలాడాడు, బెదిరించాడు, కానీ ఆమె లొంగలేదు. తాను నమ్ముకున్న విధానాలకు, కుటుంబ గౌరవానికి కట్టుబడి, ముంబై మాఫియా అధినేత సోదరుడి దగ్గరకు వెళ్లడానికి నిరాకరించింది. ఈ నిర్ణయం ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది.

ముంబైకి సుపారీ గ్యాంగ్‌..
మాధురి నిరాకరణతో ఆగ్రహించిన అనీస్‌ ఇబ్రహీం, ఆమెను హత్య చేయించేందుకు కొందరు హంతకులకు సుపారీ ఇచ్చాడు. ఈ హంతకుల బృందం ముంబైలో దిగినట్లు గుర్తించిన అప్పటి సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ జితేంద్ర దీక్షిత్‌ మాధురిని కలిశారు. ‘నీ ప్రాణాలకు ప్రమాదం ఉంది. కొన్నాళ్లు విదేశాలకు వెళ్లిపో. తిరిగి రావద్దు‘ అని ఆయన సూచించారు.

షూటింగ్స్‌ విదేశాలకే పరిమితం
ఆ సమయంలో బాలీవుడ్‌ సినిమాల షూటింగ్స్‌ ఎక్కువగా విదేశాల్లోనే జరిగేవి. యూరప్, దుబాయి వంటి చోట్ల ఔట్‌డోర్‌ షూటింగ్స్‌ నిర్వహించడం సాధారణం. కానీ, మాధురి విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. దావూద్‌ గ్యాంగ్‌ చేరుకోలేని, అంతర్జాతీయ చట్టపరమైన రక్షణ ఉన్న యూరప్‌ దేశాల్లో మాత్రమే ఆమె షూటింగ్స్‌ జరిపేవారు. దుబాయిలో దావూద్‌ సామ్రాజ్యం ఉండటంతో, అక్కడికి వెళ్లడం పూర్తిగా నిషేధించారు. ప్రతి షూటింగ్‌ లొకేషన్‌లోనూ ప్రత్యేక భద్రతా సిబ్బందిని నియమించారు.

నాలుగేళ్ల బహిష్కరణ తర్వాత..
మాధురి దీక్షిత్‌ దాదాపు నాలుగైదేళ్ల పాటు భారత్‌కు దూరంగా, విదేశాల్లోనే గడిపింది. ఈ కాలంలో ఆమె కుటుంబం కూడా ముంబైలోని తమ ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. 1993 మార్చిలో జరిగిన ముంబై సిరీస్‌ బాంబు పేలుళ్ల తర్వాత పరిస్థితి మారింది. ముంబై పేలుళ్ల తర్వాత పోలీసులు దావూద్‌ ఇబ్రహీం కుటుంబం, అతడి గ్యాంగ్‌పై పట్టు బిగించారు. దావూద్‌ గ్యాంగ్‌ ముంబైలో తమ పట్టును కోల్పోవడంతో, మాఫియా బెదిరింపులు తగ్గాయి. ఈ పరిణామాల తర్వాతే మాధురి దీక్షిత్‌ ధైర్యంగా భారత్‌కు తిరిగి వచ్చి, సినిమాల్లో నటించడం ప్రారంభించింది.

బాలీవుడ్‌లో మాఫియా సామ్రాజ్యం..
మాధురి దీక్షిత్‌ ఘటన కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. 1980–90ల మధ్య కాలంలో ముంబై మాఫియా బాలీవుడ్‌ను తమ పిడికిలిలో ఉంచుకుంది. సంజయ్‌ దత్‌ దావూద్‌ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై అరెస్టు, జైలు శిక్ష అనుభవించారు. హీరోయిన్‌ మందాకిని దావూద్‌ ఇబ్రహీంతో ఆమెకు గాఢమైన సంబంధాలు ఉన్నాయని, ఆమె కెరీర్‌ను మాఫియా నియంత్రించిందని ఆరోపణలు వచ్చాయి. ప్రముఖ నిర్మాత భరత్‌షాకు దావూద్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై అరెస్టయ్యారు. టీసిరీస్‌ అధినేత గుల్షన్‌కుమార్‌ 1997లో దావూద్‌ గ్యాంగ్‌ హత్య చేయించింది.

మాధురి దీక్షిత్‌ ధైర్యం, ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె ప్రాణాలను కాపాడటమే కాదు, బాలీవుడ్‌లో మాఫియా పట్టును ప్రశ్నించే ధైర్యాన్ని ఇతర నటీనటులకు కూడా ఇచ్చింది. 1993 ముంబై పేలుళ్ల తర్వాత పోలీసులు మాఫియాపై ఉక్కుపాదం మోపడంతో, బాలీవుడ్‌ నెమ్మదిగా ఆ చీకటి నుంచి బయటపడింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version