MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు అధ్యక్ష బరిలో హోరాహోరీగా తలపడుతున్నారు. వీరిద్దరిలో గెలుపు ఎవరిది అన్నది ఆసక్తి రేపుతోంది. సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా ప్రస్తుతం ప్రకాష్ రాజ్ వెంటే ఉన్నారు. ముఖ్య హీరోలు, నటులు ఆయన వెంటే ఉన్నారు.

అయితే మంచు విష్ణు వెంట తెలంగాణ నటులు.. ఇతర సాధారణ నటులున్నారు. కానీ పరిస్థితి ఎన్నికల వరకూ వెళుతున్న వేళ మంచు విష్ణుకు మద్దతు పెరుగుతోంది. తాజాగా ‘నాన్ లోకల్’ నినాదం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ టాలీవుడ్ నటుడు, దర్శకుడు రవిబాబు, మరో నటుడు రాజీవ్ కనకాల ఆరోపించారు. మిగతా వారు కూడా స్థానికుడైన మంచు విష్ణుకే ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ఇది సామాన్య కళాకారుల్లో సెంటిమెంట్ ను రాజేస్తోంది.
తాజాగా మా ఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్ ను ఓడించాలని.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడి విత్ డ్రా చేసుకున్న సీవీఎల్ నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. నేను నేను తప్ప మరొక విషయం పట్టని ప్రకాష్ రాజ్ ను ఈ ఎన్నికల్లో పోటీచేయకుండా ఉంటే బాగుంటుందని.. బహుశా అతడు విత్ డ్రా చేసుకుంటాడని ఆశిస్తున్నానని’ సీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలను గెలిపించాలని సీవీఎల్ కోరారు. విష్ణు ప్యానెల్ లో ఉన్న బాబు మోహన్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఉన్న ఉత్తేజ్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశం అన్నా.. దేవుడు అన్నా చులకన భావం ఉన్న ప్రకాష్ రాజ్ ను ఓడించాలని పిలుపునిచ్చాడు.
ఇక ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు తొలిసారి తెలంగాణ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ప్రకాష్ కు తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ మద్దతు ప్రకటించారు. సినిమా గ్రూపులకు అతీతంగా అందరూ ఒక్కమాటపై ప్రకాష్ ను గెలిపించుకోవాలని కోరారు. సమస్యలపై, సమాజంపై అవగాహన ఉన్న వ్యక్తికి ఓటు వేస్తే అందరికీ మేలు జరుగుతుందని.. ప్రకాష్ ను గెలిపించడం ఒక ప్రజాస్వామ్యవాదిని గెలిపించినట్టు అని పేర్కొన్నాడు.
అయితే టాలీవుడ్ కళాకారులు చాలా మంది ఓటు హక్కు ఉన్న వారిలో సాధారణ నటీనటులే. వారు నాన్ లోకల్ అయిన ప్రకాష్ రాజ్ కు మద్దతుగా లేరని తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ సినిమాల్లో బయటి వారికి అవకాశాలు ఇస్తున్నారని.. లోకల్ వారిని పక్కనపెడుతున్నారని.. ఈ క్రమంలోనే మంచు విష్ణుకే మద్దతిస్తామని చాలా మంది బయటపడుతున్నారు. మీడియా ముందుకొచ్చి వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘నాన్ లోకల్ ’ నినాదం ప్రకాష్ రాజ్ కు మైనస్ గా మారుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రకాష్ కు మద్దతుగా నిలిచిన బడా ప్రముఖులు ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయినట్టు సమాచారం.