MAA Elections:మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల తేదీ వచ్చేసింది. రెండు గ్రూపులుగా విడిపోయి మాటల తూటాలు పేల్చుతున్న సినీ ప్రముఖుల ప్రచారం మరింత ఊపందుకుంది. ‘మా’ ఎన్నికలకు తేదీ ప్రకటించేశారు. అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని గతంలో జరిగిన సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘మా’ ఎన్నికలకు సంబంధించిన తేదీ, నియమ నిబంధనలు, ఇతర విషయాలను అధికారికంగా ప్రకటించి సంచలనం రేపారు.
మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తాజాగా మీడియాకు ఎన్నికలపై వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. 8మంది ఆఫీస్ బేరర్స్ 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తో కూడిన కమిటీకి ఈ ఎన్నికలు జరుగనున్నాయి.
మా ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల తేదీలను కూడా ప్రకటించేశారు. సెప్టెంబర్ 28-29 తేదీల మధ్యన నామినేషన్లు స్వీకరించి 30న వాటిని పరిశీలిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఉపసంహరణకు అవకాశం ఉంటుందని.. ఆ తర్వాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటిస్తామని తెలిపారు. ఒక అభ్యర్థి ఒకే పదవికి పోటీచేయాలని సూచించారు.
ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు పోటీ పడుతున్నారు. వీళ్లిద్దరూలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తి నెలకొంది. ప్రకాష్ రాజ్ కు సపోర్టుగా ఉన్న బండ్ల గణేష్ ఆ ప్యానెల్ నుంచి వైదొలిగారు. ఇక ఎవరి క్యాంపులు వారు భారీగా విందు, వినోదాలు ఏర్పాటు చేసి ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.