MAA Elections: ‘రిపబ్లిక్’ డే వేడుకగా పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు నటుడు మోహన్ బాబు కౌంటర్ ఇచ్చాడు. తన కుమారుడు మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు. ఇక మంచు విష్ణు సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తనను పోటీ చేయవద్దని ఒత్తిడి చేశారని.. జూనియర్ ఎన్టీఆర్ తనకు మద్దతుగా నిలిచాడని చెప్పుకొచ్చారు. నిజాలు చెప్పి సంచలనం సృష్టించారు.
‘నన్ను రెచ్చగొట్టాలని కొందరు చూశారు. మౌనంగా ఉన్నానని ఊరుకోవద్దు’ అని మోహన్ బాబు పరోక్షంగా పవన్ ను ఉద్దేశించి అన్నారు. ‘సింహం నాలుగు అడుగులు వెనక్కేసిందని తేలిగ్గా చూడొద్దు. వేదిక దొరికింది కదా అని ఇష్టారీతిగా మాట్లాడుతారా? నేను మాట్లాడాల్సింది చాలా ఉంది. అయితే ఇది వేదిక కాదు’’ అంటూ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారం లేకపోతే వృథా అని మోహన్ బాబు అన్నారు. నటీనటులకు సాయం చేయాలని ఇద్దరు సీఎంలను కోరాలని అన్నారు. కేసీఆర్ ను నటీనటులు ఎప్పుడైనా సన్మానించారా? జగన్ ను ఎప్పుడైనా ఏ వేడుకైనా ఆహ్వానించారా? అని మోహన్ బాబు ప్రశ్నించారు.
తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అధికారంలో ఉండవచ్చునని.. కానీ ‘మా’ అంతా ఒక్కటే పార్టీ అని మోహన్ బాబు స్పష్టం చేశారు. ‘దాసరి లేని లోటును భర్తీ చేయలేమని.. ఇండస్ట్రీ పెద్ద అనే హోదా నాకు వద్దు అని మోహన్ బాబు అన్నారు.
ఇక ‘మా’ ఎన్నికల్లో తనను పోటీచేయవద్దని.. తప్పుకోవాలని చిరంజీవి కోరారని మంచు విష్ణు సంచలన విషయాన్ని చెప్పుకొచ్చారు. కానీ నేను, నాన్న మోహన్ బాబు పోటీచేయాలనే డిసైడ్ అయ్యామని.. అదే చెప్పామని స్పష్టం చేశారు. మా ఎన్నికల్లో గెలిచాక తనకు తొలుత ఫోన్ చేసింది ఎన్టీఆర్ అని.. తారక్ సపోర్టు ఎప్పుడూ ఉంటుందని విష్ణు చెప్పుకొచ్చాడు.