
MAA Elections:అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. వరుస వివాదాలు.. విమర్శలు.. చేరికలు, వైదొలగడాలతో కాక రేపుతున్నాయి. ప్రధానంగా ప్రకాష్ రాజ్(Prakash Raj), మంచు విష్ణు(manchu vishnu) వర్గాలుగా విడిపోయిన ‘మా’ ఎన్నికల్లో ఎవరు ఎటువైపు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇన్నాళ్లు ప్రకాష్ రాజ్ తోపాటు పోటీలో నిలబడ్డ జీవిత, హేమలు ఇటీవలే ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో చేరిపోయి పెద్ద షాక్ ఇచ్చారు. దీంతో ఉత్కంఠ పెరిగిపోయింది. ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణులా మా ఎన్నికల ఫైట్ మారిపోయింది.
తాజాగా నిర్మాత, నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) ఏకంగా ప్రకాష్ రాజ్ కు షాకిచ్చాడు. ఆయన ప్యానల్ నుంచి తప్పుకుంటున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేశాడు ఆదివారం మధ్యాహ్నం ప్రకాష్ రాజ్ ను ట్యాగ్ చేస్తూ బండ్ల గణేష్ ఈ ట్వీట్ పెట్టడం సినిమా వర్గాల్లో చర్చనీయాశమైంది.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన బండ్ల గణేష్ తాను ఈ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీలోకి దిగుతున్నట్లు ప్రకటించి ప్రకాష్ రాజ్ కు షాకిచ్చాడు.
‘నా మనస్సాక్షికి ఎంత చెప్పినా వినడం లేదని.. అందుకే పోటీచేస్తున్నానని.. వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం అని.. దాని కోసం పోటీచేస్తున్నట్టు’ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్లు రెండేళ్లుగా ఏమీ చేయలేదని.. ఇప్పుడు చేస్తామంటే ‘మా’ సభ్యులు నమ్మరన్నారు.
ఇక ‘ప్రకాష్ రాజ్ ప్యానల్ లోకి జీవితా రాజశేఖర్ రావడం తనకు ఇష్టం లేదని బండ్ల గణేష్ అన్నారు. నాకు ఎంతో ఇష్టమైన మెగా ఫ్యామిలీని ఆమె ఎన్నోసార్లు కించపరిచారు. అందుకే నేను ఈ ప్యాన్ నుంచి తప్పుకుంటున్నారు. ఆమెపై జనరల్ సెక్రటరీ పదవి కోసం బరిలోకి దిగుతున్నాను’ అని బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ నుంచి బండ్ల గణేష్ ను తప్పించి జీవితను తీసుకున్నాడు.బహుషా ఆ కోపంతోనే బండ్ల పోటీకి దిగినట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరికొన్ని రోజుల్లోనే ‘మా ’ ఎన్నికలు జరుగున్నాయి. ఇటీవలే తన టీంను పూర్తిస్థాయిలో ప్రకాష్ రాజ్ ప్రకటించి మీడియా ముందుకు వచ్చారు. జీవిత, హేమలను కూడా తన టీంలో కలిపేసుకున్నాడు. టీంలోని 24మంది సభ్యులు, వారి పదవుల గురించి వివరించారు.
ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో నటుడు సాయికుమార్, నిర్మాత బండ్ల గణేష్ లను అధికార ప్రతినిధులుగా ప్రకాష్ రాజ్ ప్రకటించారు. అయితే ఆ పదవి తనకు వద్దంటూ బండ్ల గణేష్ తాజాగా వైదొలగడం హాట్ టాపిక్ గా మారింది.