Kinnera Mogulaiah : ఇప్పుడు టాలీవుడ్లో మార్మోగుతున్న పాట ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) టైటిల్ సాంగ్. పవన్ కల్యాణ్ (Pawan kalyan) పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదలైన ఈ పాట.. సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే.. 9 మిలియన్ల వ్యూస్ తో రచ్చ చేసింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ నంబర్ 1 స్థానంలో నిలిచింది.
అయితే.. ఈ పాటను ఇద్దరు గాయకులు ఆలపించారు. మొదుట సాకీతో మొదలు పెట్టి, అద్భుతంగా ఆలపించిన జానపద గాయకుడు దర్శనం మొగులయ్య. కిన్నెర మెట్ల వాయిద్యకారుడైన మొగులయ్య ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ఆయన గురించి సినీ ఇండస్ట్రీతోపాటు ప్రేక్షకులు కూడా చర్చించుకుంటున్నారు. అయితే.. కనీసం ఉండడానికి కూడా ఇళ్లు లేని మొగులయ్యకు పవన్ కల్యాణ్ ఆర్థిక సహాయం అందిస్తే దాన్ని తిరస్కరించారు. అదే సమయంలో ఓ షరతు పెట్టారు.
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లో సాకీ, పల్లవిని ఆలపించిన దర్శనం మొగిలియ్య.. తన గాత్రంతో శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఆ తర్వాత చరణాలను మరో ప్రముఖ సింగర్ రామ్ మిరియాల అందుకున్నారు. వీరిద్దరి కలయికలో పూర్తయిన ఈ పాట.. పవర్ స్టార్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాట విన్నవారంతా.. రెగ్యులర్ గొంతుకు పూర్తి భిన్నంగా ఉన్న మొగిలయ్య గురించి చర్చించుకుంటున్నారు.
కాగా.. ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న మొగులయ్యకు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సినిమాలో పాట గురించి చెప్పారట. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఫోన్ చేసి తనతో మాట్లాడారని కిన్నెర మొగులయ్య తెలిపారు. పవన్ ఫోన్ తర్వాత హైదరాబాద్ వెళ్లినట్టు చెప్పారు. ఆ తర్వాత తనకు హోటల్ లో రూమ్ ఇచ్చి బాగా చూసుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే పవన్ తన వద్దకు వచ్చి నమస్కరించారని, అయితే.. ఆయనే పవన్ కల్యాణ్ అన్న సంగతి తనకు తెలియదని అన్నారు మొగులయ్య. ఆయన పీఏ చెప్పే వరకు తెలియదన్నారు. ఆ తర్వాత ‘‘మీ కిన్నెర వాయిద్యాన్ని ముట్టుకోవచ్చా?’’ అని పవన్ అడిగారట. అప్పుడు స్వయంగా పవన్ చేతిలో వాయిద్యాన్ని పెట్టానని చెప్పారు మొగులయ్య.
అయితే.. ఆ తర్వాతనే పవన్ గొప్పతనం ఏంటో తెలిసిందని, అందరూ ఫోన్ చేసి ఆయన గురించి చెబితే.. ఎంత పెద్దవాడో అర్థమైందని అన్నారు మొగులయ్య. అలాంటి పవన్ కల్యాణ్ తనకు 2 లక్షల రూపాయలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అయితే.. ఈ డబ్బులు పవన్ కల్యాణ్ ను కలిసిన తర్వాతే తీసుకుంటానని చెబుతున్నాడు. ఆయనను కలిసి మాట్లాడకుండా ఒక్క పైసా కూడా తీసుకోనని అన్నారు మొగులయ్య.