Lenin Movie Review: రివ్యూ: లెనిన్
నటీనటులు: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు, సునీల్, ప్రమోద్ పంజు తదితరులు
సంగీత దర్శకుడు: థమన్ ఎస్.
ఛాయాగ్రహణం: లియోన్ బ్రిట్టో
ఎడిటర్: నవీన్ నూలి
దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరు
నిర్మాతలు: అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
ఏజెంట్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని లెనిన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్ అక్కినేని. నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించడంతో సినిమాను ఎలాగైనా హిట్ చేయాలనే అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారని అందరికీ హింట్ ఇచ్చినట్టయింది. మహాభారతం రెఫరెన్స్ తో కట్ చేసిన ట్రైలర్, జూనియర్ యన్టీఆర్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం లాంటివి ఈ సినిమాపై కొంతమేరకు అంచనాలు పెంచాయి. లెనిన్ ఆనే డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా అఖిల్ కు రిలీఫ్ ఇచ్చిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
శ్రీరామాపురం గ్రామ నేపథ్యం, మహాభారతంలోని ద్రౌపది పాత్రను పూజించే ఆచారం.. దాని చుట్టూ ఉన్న భారతం మిట్ట ఆనే కొన్ని రోజుల ఉత్సవాల చుట్టూ తిరుగుతుంది ఈ చిత్రం. ఈ హై వోల్టేజ్ విలేజ్ యాక్షన్ డ్రామా ఫుల్ ఇంటెన్సిటీతో ప్రారంభమవుతుంది. పాతికేళ్ళ క్రితం 2001 ప్రాంతంలో కర్నూలు జైలు నుంచి విడుదలవుతాడు లెనిన్(అఖిల్). వెంటనే తన గ్రామానికి బయలుదేరతాడు. లెనిన్ పాత్రకు ఏదో బలమైన నేపథ్యం ఉందని, అదేంటో తెలుసుకోవాలని ప్రేక్షకులకు ఆసక్తి కలుగుతుంది. ఊరిలో లెనిన్ పేరు వింటే కొందరు భయపడతారు, కొందరు అది గత చరిత్ర అంటారు ఇలా రకరకాలుగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఫ్లాష్ బ్యాక్ మొదలు పెడితే లెనిన్ శ్రీరామాపురం లోని ఒక పెద్ద కుటుంబంలో పెరిగిన అనాధ. అయితే వాళ్ళు ఇతన్ని కొడుకులాగా పెంచుకుంటారు. అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. అప్పటి దాకా సాఫీగా జరిగిన లెనిన్ జీవితం భారతి (భాగ్యశ్రీ బోర్సె) లో ప్రేమలో పడడంతో ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఊరిలో చాలా గొడవలకు, కుటుంబంలో బంధువుల మధ్య కలహాలకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో లెనిన్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా? ఈ మొత్త కథలో అదే కుటుంబ వారసుడు అయిన వసంత్(ప్రమోద్ పంజు) పాత్ర ఏంటి? లెనిన్ అసలు జైలుకు వెళ్ళిన కారణం ఏంటి అనేవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
దర్శకుడు మురళి కిషోర్ సినిమాను ఒక స్ట్రాంగ్ నోట్‌తో, బలమైన విలేజ్ సెటప్‌తో ప్రారంభించాడు. టేకాఫ్ బాగానే ఉన్నా కమర్షియల్ టెంప్లేట్ లోను ఫాలో కావడంతో ఫస్టాఫ్‌లో కథనం నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా అఖిల్, భాగ్యశ్రీల మధ్య వచ్చే లవ్ ట్రాక్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్, అఖిల్ పాత్ర స్లో-మోషన్ ఎలివేషన్ సీన్లు ఎక్కువ అవ్వడంతో మొదటి భాగం కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. అయితే, ప్రీ-ఇంటర్వెల్ బ్లాక్ నుండి సినిమా ఒక్కసారిగా పుంజుకుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ లో వచ్చే మలుపులు, ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్, ప్రేక్షకులను కొంతవరకూ మెప్పిస్తాయి. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కొన్ని చోట్ల ఇంటరెస్టింగ్ గా కొన్ని చోట్ల రొటీన్ గా అనిపిస్తూ ఉంటుంది.
అఖిల్ అక్కినేని పర్ఫామెన్స్ సటిల్ గా, పాత్రకు తగ్గట్టుగా ఉంది. చదువురాని పల్లెటూరి కుర్రాడి గెటప్ సూట్ అయింది. యాక్షన్ ఎపిసోడ్స్ లో అఖిల్ ఆకట్టుకుంటాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె భారతి పాత్రలో చలాకీగా నటించడమే కాకుండా అఖిల కు జోడీగా కూడా సెట్ అయింది. ఎప్పటిలాగే శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరీరావు తమ పాత్రలకు న్యాయం చేశారు. రాంకీ పాత్ర కూడా డీసెంట్ గా ఉంది. అయితే సినిమాలో సర్ప్రైజ్ మాత్రం కన్నడ నటుడు ప్రమోద్ పంజు. చాలా సీన్స్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తాడు.
థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతం అని చెప్పలేం కానీ సినిమాకు హెల్ప్ అయింది. రెండు పాటలు బాగున్నాయి. లియోన్ బ్రిట్టో రూరల్ విజువల్స్‌ను, నైట్ షాట్స్‌ను తన కెమెరాలో చాలా అద్భుతంగా క్యాప్చర్ చేశాడు. సినిమాలో పాత్రలు ఎక్కువ ఉండడంతో ఆ పాత్రలు రిజిస్టర్ అయ్యే సమయం కూడా ఉండదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ తీసుకోవడంతో రైటింగ్ వీక్ గా అనిపిస్తుంది. అఖిల్ గత సినిమాలతో పోలిస్తే మాత్రం ఇది బెటర్ ప్రాడక్ట్ అని చెప్పవచ్చు. మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఓకే అనిపించే సినిమా.
సినిమాలో ఏం బాగున్నాయో తెలుసా?
1. అఖిల్ మేకోవర్, సటిల్ యాక్టింగ్, ప్రమోద్ పంజు యాక్టింగ్
2. ప్రీ-క్లైమాక్స్ & క్లైమాక్స్ ఎపిసోడ్స్.
3. భాగ్యశ్రీ బోర్సే నటన, గ్లామర్.
సినిమాలో బాగలేనివి ఇవి:
1. ల్యాగ్ అనిపించే స్లో ఫస్టాఫ్
2. పెద్దగా ఇంపాక్ట్ లేని రొటీన్ లవ్ స్టోరీ.
3. కమర్షియల్ టెంప్లేట్ సీన్లు.
రేటింగ్: 2.5/5
ఫైనల్ వర్డ్: లెనిన్ పాస్ అయ్యెన్
