Lakshmi Narasimha Re-Release Response : నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘లక్ష్మీ నరసింహా'(Lakshmi Narasimha) చిత్రాన్ని 4K లోకి మార్చి, సరికొత్త పాట ని జతచేసి నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు రీ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందని అభిమానులు భావించారు కానీ, ఘోరమైన డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. కనీసం పోస్టర్ ఖర్చులకు కూడా రాలేదంటే ఏమాత్రం అతిశయోక్తి లేదేమో. బాలయ్య ప్రస్తుతం సీనియర్ హీరోలలో పీక్ ఫామ్ తో కొనసాగుతున్నాడు. అఖండ తో మొదలైన బాలయ్య జైత్ర యాత్ర, మొన్న విడుదలైన డాకు మహారాజ్ వరకు కొనసాగింది. యూత్ లో కూడా ఇంతకు ముందుతో పోలిస్తే బాలయ్య క్రేజ్ ఇప్పుడు బాగా పెరిగింది. అయినప్పటికీ ఇంతటి దారుణమైన రెస్పాన్స్ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నందమూరి అభిమానులు వాపోతున్నారు.
ఇండియా వైడ్ గా నిన్న ఈ చిత్రానికి వచ్చిన గ్రాస్ వసూళ్లు అక్షరాలా 4 లక్షల రూపాయిలు మాత్రమే. ప్రింట్ ఖర్చులే తక్కువలో తక్కువ కోటి రూపాయిల వరకు ఉంటుంది. మళ్ళీ దానికి పబ్లిసిటీ మెటీరియల్ కోసం కనీసం 20 లక్షల రూపాయిలు అయినా అవుతుంది. అంటే పోస్టర్లు, స్టాండీలు వగైరా అన్నమాట. కనీసం వాటి ఖర్చులు అయినా ఈ చిత్రం రాబడుతుందేమో అని ఆశిస్తే, పోస్టర్ ఖర్చులలో కేవలం 5 వ వంతు వసూళ్లు మాత్రమే ఈ చిత్రానికి వచ్చింది. ఎంతటి దారుణమైన ఫలితమే మీరే చూడండి. పోనీ ‘లక్ష్మీ నరసింహా’ క్లాసిక్ కాదు, బాలయ్య సినిమాల్లో అభిమానులతో పాటు సాధారణ సినీ అభిమానులు కూడా ఇష్టపడే చిత్రాల్లో ఒకటి ‘ఆదిత్య 369’. ఈ చిత్రాన్ని కూడా ఏప్రిల్ నెలలో గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. రెస్పాన్స్ డిజాస్టర్ రేంజ్ లో వచ్చింది. కనీసం పది లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు.
దీనిని బట్టీ చూస్తుంటే బాలయ్య ఇమేజ్ జనాల్లో ఇంకా ఏ మాత్రం మారలేదు, కేవలం మంచి సినిమాలు చేస్తూ ఉండడం వల్లే ఈమధ్య వరుసగా హిట్స్ పడుతున్నాయి. అవే సినిమాలు వేరే హీరోలు చేసి ఉండుంటే ఇండస్ట్రీ రికార్డ్స్ షేక్ అయ్యేవి అంటే సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో క్లాసిక్ గా నిల్చిన ‘జగదేక వీరుడు..అతిలోక సుందరి’ చిత్రం గ్రాండ్ గా రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దాదాపుగా మూడు కోట్ల 50 లక్షల రూపాయిలు వచ్చాయి. హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో నెల రోజులపాటు రన్ అయ్యింది. దీనిని బట్టీ చిరంజీవి కి, బాలయ్య కి మధ్య ఉన్న వ్యత్యాసం మీరే అర్థం చేసుకోండి అంటూ సోషల్ మీడియా లో మెగాస్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.