‘కృతి శెట్టి’ తారాజువ్వలా ఎదిగి అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ల సరసన చేరిన యంగ్ హీరోయిన్. ఒక్క సినిమాతోనే ఫుల్ డిమాండ్ క్రియేట్ చేసుకున్న ఏకైక యంగ్ హీరోయిన్ కూడా. ఈ యంగ్ బ్యూటీ నటనకు తెలుగు వెండితెరపై నీరాజనాలు అందాయి. ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి తెలుగు దర్శక నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా చిన్న సినిమా వాళ్ళు ఈ హీరోయిన్ కోసం ఎదురుచూస్తూ పరితపిస్తున్నారు.
అంతగా కృతి హవా నడుస్తోంది మరి. ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ, ఎక్కడా గ్యాప్ ఇవ్వడం లేదు. తనకు వచ్చిన ఫాలోయింగ్ ను ఫుల్ క్యాష్ చేసుకునే పనిలో పడింది. చిన్న వయసులోనే లౌక్యం చూపిస్తూ.. ఎక్కడికక్కడ ఆకట్టుకుంటూ భారీ రెమ్యునరేషన్లను అందుకుంటూ ఆ విధంగా ముందుకు పోతుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ త్వరలోనే మరో మూడు సినిమాలు ప్రకటించబోతుంది.
ఆ మూడు సినిమాల్లో అక్కినేని అఖిల్ సినిమా ఒకటి కాగా, వైష్ణవ్ తేజ్ తో మరో సినిమా, అలాగే విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. ఇలా కృతి చేతిలో తాజాగా ఈ మూడు సినిమాలు చేరాయని తెలుస్తోంది. ఇక కృతి శెట్టి ప్రస్తుతం నాని సరసన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో కృతిదే మెయిన్ హీరోయిన్ లీడ్.
అలాగే ‘ఉస్తాద్’లో రామ్ తో కలిసి ఆల్ రెడీ నటిస్తోంది.అలాగే, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ సుధీర్ బాబుతో ఒక సినిమా చేస్తోంది. మొత్తానికి తన క్యూట్ లుక్స్ తో కుర్రకారు హృదయాలను దోచుకుంది కృతి. అందుకే కుర్ర హీరోల నుండి ఏవరేజ్ హీరోల వరకు ఈ బ్యూటీతో రొమాన్స్ చేయడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కృతి మాత్రం స్టార్ హీరోల సరసన జత కట్టేందుకు ఉత్సాహ పడుతుంది. రష్మికలా తాను కూడా స్టార్ అయిపోవాలని ఆశ పడుతుంది.