కోటా శ్రీనివాసరావు రంగస్థల నటుడు. అనంతరం ఆయన సినిమాల్లోకి వచ్చారు. కోటా నటన చాలా సహజంగా ఉంటుంది. క్యారెక్టర్ ఏదైనా జీవిస్తాడు. కడుపుబ్బా నవ్వించే పాత్ర నుండి కరుడుగట్టిన విలన్ వరకు… ఆయన చేయని పాత్ర లేదు. కోటాకు ఉన్న మరో గొప్ప లక్షణం… అన్ని రకాల మాండలికాలు మాట్లాడగలరు. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరు, కోనసీమ మాండలికాల్లో డైలాగ్స్ అనర్గళంగా చెప్పగలడు. మూడు దశాబ్దాలకు పైగా సినిమా ప్రస్థానంలో కోటా వందల చిత్రాల్లో విలక్షణ పాత్రలు చేశారు.
కాగా కోటా మాట తీరు కొంచెం కటువుగా ఉంటుంది. ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారు. ఈ గుణం ఆయన్ని వివాదాల్లోకి నెత్తిన సందర్భాలు ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా తెరకెక్కిన సెటైరికల్ మూవీ మండలాధీశుడు చిత్రంలో కోటా నటించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. అప్పట్లో ఎన్టీఆర్ అభిమానులు కోటా పై దాడికి ప్రయత్నం చేశారు.
అలాగే చిరంజీవి నటించిన ఓ మూవీ డిజాస్టర్ కాగా… కోటా ఆ మూవీపై సెటైర్స్ వేశారట. 1991లో చిరంజీవి హీరోగా స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకుడు. ఈ చిత్రంలో కోటా కూడా ఒక కీలక రోల్ చేశాడు. కే ఎస్ రామారావు నిర్మాతగా ఉన్నారు. సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. కే ఎస్ రామారావు అందరి అభిప్రాయం అడిగి తెలుసుకుంటున్నాడట.
కే ఎస్ రామారావు కోట శ్రీనివాసరావును కూడా అడిగారట. హా ఏముందండి… ఇది స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ కాదు… టూ వరస్ట్ పురం పోలీస్ స్టేషన్ అని సెటైర్ వేశాడట. ఈ విషయం చిరంజీవికి తెలిసి.. ఏంటి నా మూవీ మీద జోకులు వేస్తున్నావట? అని అడిగాడట. ఉన్న విషయమేగా చెప్పాను, అన్నాడట కోటా. సీరియస్ గా తీసుకోని చిరంజీవి నవ్వి వదిలేశాడట.
ఈ మధ్య కోటా సినిమాలు చేయడం లేదు. ఆయన ఆరోగ్యం కొంచెం దెబ్బతింది. అందులోనూ వృద్ధాప్యంతో చురుకుగా లేకున్నారు. దాంతో దర్శకులు పాత్రలు ఇవ్వడం లేదు. కోటాకు మాత్రం చివరి శ్వాస వరకు నటించాలనే ఉందట.