Ram Charan: టాలీవుడ్ స్టార్స్ అందరికీ వివాహాలు అయ్యాయి. పిల్లలు కూడా ఉన్నారు. ఒక్క ప్రభాస్(Prabhas) మాత్రమే సింగిల్ స్టేటస్ అనుభవిస్తున్నాడు. ప్రభాస్ వయసు 45 ఏళ్ళు. గత పదేళ్లుగా ప్రభాస్ పెళ్లిపై పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. హీరోయిన్ అనుష్క శెట్టిని(Anushka Shetty) వివాహం చేసుకుంటున్నాడంటూ ఏళ్ల తరబడి పుకార్లు చక్కర్లు కొట్టాయి. వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాలు చేశారు. ఇక బాహుబలి 2 విడుదల తర్వాత వివాహం చేసుకోవడం ఖాయమే, అంటూ కథనాలు వెలువడ్డాయి. సాహో మూవీ ప్రమోషన్స్ లో ప్రభాస్ ని ఈ ప్రశ్న వెంటాడింది. ఎక్కడకు వెళ్లినా అనుష్కతో మీకున్న అనుబంధం ఏమిటీ? పెళ్లి ఎప్పుడు? అని ప్రభాస్ ని అడిగారు.
ప్రభాస్ ఇబ్బంది పడుతూ, అనుష్క నాకు బెస్ట్ ఫ్రెండ్. అంతకు మించిన బంధం లేదన్నారు. తన పెళ్లి పై ప్రభాస్ ఎప్పుడూ స్పష్టమైన సమాధానం చెప్పింది లేదు. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య నిలదీస్తే, సిల్లీ సమాధానాలు చెప్పి తప్పించుకున్నాడు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు, ఆయన సతీమణి శ్యామల దేవి మాత్రం, పెళ్ళి చేస్తాం అంటూ కామెంట్స్ చేసేవారు. తాజాగా ఓ కీలక అప్డేట్ వచ్చినట్లు సమాచారం. అన్ స్టాపబుల్ సీజన్ 4 కి గెస్ట్ గా రామ్ చరణ్ వచ్చారు. బాలయ్యతో ఆయన మమేకం అయ్యారు.
సంక్రాంతి కానుకగా బాలయ్య-రామ్ చరణ్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. కాగా ఈ షోలో ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్ ని బాలకృష్ణ అడిగారట. తూర్పు గోదావరి జిల్లా గణపవరం అనే ఊరికి చెందిన అమ్మాయిని ప్రభాస్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడని రామ్ చరణ్ చెప్పాడట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు. ఎపిసోడ్ ప్రసారమైతే స్పష్టత వస్తుంది.
మరోవైపు ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజి చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, ప్రశాంత్ నీల్ సలార్ 2, నాగ అశ్విన్ కల్కి 2 చిత్రాలు ఆయన పూర్తి చేయాల్సి ఉంది. సంక్రాంతికి మరో కొత్త సినిమా ప్రకటించనున్నాడని ప్రచారం జరుగుతుంది.