https://oktelugu.com/

Makar Sankranti: భాగ్యనగరం ఖాళీ.. అన్ని దారులు ఏపీ వైపే.. ఆ రూట్లలో హై అలెర్ట్!

హైదరాబాద్( Hyderabad) నగరం ఇప్పుడిప్పుడే ఖాళీ అవుతోంది. విజయవాడ ( Vijayawada)వైపు వచ్చే జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది.

Written By:
  • Dharma
  • , Updated On : January 11, 2025 / 01:24 PM IST

    Makar Sankranti

    Follow us on

    Makar Sankranti: తెలుగు రాష్ట్రాల్లో( Telugu States) సంక్రాంతి సందడి ప్రారంభమైంది. ప్రధానంగా ఏపీలో అతి పెద్ద పండుగగా సంక్రాంతికి పేరు ఉంది. ఎక్కడ ఉన్నా.. ఎంత దూరంలో ఉన్నా.. సంక్రాంతి( Pongal) నాడు సొంత గ్రామాన్ని వెతుక్కుని రావడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే సంక్రాంతి సమయాల్లో నగరాలు నిర్మానుష్యంగా మారుతాయి. గ్రామాలు కళకళలాడుతుంటాయి. అయితే ఇప్పుడు ఏపీవ్యాప్తంగా సంక్రాంతి ప్రారంభమైంది. మరోవైపు పిల్లలకు పండగ సెలవులు కూడా ఇచ్చారు. దీంతో ఒక్కొక్కరు స్వగ్రామాలకు వస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇంకోవైపు శ్రమజీవులు స్వగ్రామాలకు వెళ్లడంతో హైదరాబాద్ నగరం ఖాళీగా కనిపిస్తోంది. చాలా ప్రాంతాలు నిర్మానుష్యం అవుతున్నాయి. ఇక జాతీయ రహదారులపై వాహనాలు పరుగులు పెడుతూ కనిపించాయి. టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నాయి వాహనాలు. అయితే ఈ ప్రయాణాల వేళ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు.

    * సొంత గ్రామాలకు సెటిలర్స్
    పేరుకే రాష్ట్ర విభజన( state divide) కానీ హైదరాబాదులో ఉండేది సీమాంధ్రులే. ప్రస్తుతం సంక్రాంతికి వారంతా సొంత గ్రామాలకు రావడంతో హైదరాబాద్ నగరం దాదాపు ఖాళీ అవుతోంది. ఎక్కువమంది సొంత వాహనాల్లో బయలుదేరడంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. పంతంగి టోల్ ప్లాజా( panthangi toll plaza ) వద్ద వాహనాలు బారులు తీరాయి. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా మారింది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి( Bhuvanagiri) జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వస్తున్న మార్గంలోనే వాహనాలు బారులు తీరడం విశేషం.

    * జూబ్లీ బస్టాండ్ కిటకిట
    తెలంగాణ ప్రజల సైతం సంక్రాంతికి( Pongal) తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. దీంతో జూబ్లీ బస్టాండ్ కూడా ప్రయాణికులతో రద్దీగా మారింది. మరోవైపు హైదరాబాదు నుండి ఒక్కరోజులోనే దాదాపు 70 వేల వాహనాలు ఇతర ప్రాంతాలకు వెళ్లాయి. ముఖ్యంగా ఏపీ వైపే వాహనాలు దూసుకెళ్తున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 బూతులకు గాను 10 బూతులు ఏపీ వైపు.. ఆరు బూతులను హైదరాబాద్ వైపు తెరిచి ఉంచారు. నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద 12 బూతులలో ఏడు ఏపీ వైపు.. ఐదు హైదరాబాదు వైపు తెరిచారు. ప్రయాణాలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ చేశారు. రోడ్ల విస్తరణ జరుగుతున్న పరిస్థితి దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

    * రోడ్ల మరమ్మత్తులు
    మరోవైపు సంక్రాంతి( Pongal ) వాహనాల దృష్ట్యా ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 17 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. అక్కడ రోడ్ల మరమ్మత్తు పనులు చేస్తున్నారు. వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని నేషనల్ హైవే అధికారులు సూచిస్తున్నారు. టోల్ ప్లాజా వద్ద మూడు సెకన్ల కంటే ఎక్కువగా వాహనాలు నిలిచిపోకుండా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫాస్ట్టాగులో ఇబ్బందులు తలెత్తితే వెంటనే హ్యాండ్ మిషన్ గన్నులతో చెల్లింపులు పూర్తి చేసేలా చేస్తున్నారు. మొత్తానికైతే హైదరాబాదు నుంచి ఏపీ వైపు వాహనాలు దూసుకెళ్తుండడంతో.. జాతీయ రహదారి హారన్ల మోతతో హోరెత్తుతోంది.