
లాక్‌డౌన్ కారణంగా యావత్ చిత్ర పరిశ్రమ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. షూటింగ్, సినిమా విడుదల నిలిచిపోవడంతో ఇండస్ట్రీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. నటీనటులు, సాంకేతిక సిబ్బంది, కార్మికులు ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ఇంకా పూర్తి స్థాయిలో షూటింగ్‌లు మొదలవలేదు. అలాగే, థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు కాబట్టి.. పూర్తయిన చిత్రాలు కూడా ఎప్పుడు విడుదల అవుతాయో చెప్పే పరిస్థితి లేదు. దాంతో, భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీ మొత్తం సంక్షోభం పడింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా మళ్లీ బతికి బట్టకట్టాలంటే పెనుమార్పులు అవసరమని సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా నటీనటులు తమ పారితోషికాలను తగ్గించుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయంలో ఇప్పటికే పలువురు నటీనటులు పారితోషికాన్ని తగ్గించుకోవడానికి ముందుకొచ్చారు.
అయితే కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా అందుకుంటున్న స్టార్ హీరో హీరోయిన్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కానీ, ఈ విషయంలో యువ నటి కీర్తి సురేశ్ మాత్రం అందరికీ ఆదర్శంగా నిలిచింది. తన పారితోషకాన్ని 30 శాతం వరకూ తగ్గించుకేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఆమె నిర్ణయాన్ని సినీ పరిశ్రమ వర్గాలు స్వాగతిస్తున్నారు. పలువురు నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘మహానటి’తో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న తర్వాత కీర్తి స్టార్డమ్ అమాంతం పెరిగింది. ఆమె చేతిలో దాదాపు అర డజను చిత్రాలున్నాయి. ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో వెనక్కుతగ్గడం నిజంగా గొప్పవిషమయే. నటనలోనే కాదు మంచితనంలో కూడా కీర్తి ‘మహానటి’ అని నిరూపించుకుంది.
కాగా, కీర్తి నటించిన ‘పెంగ్విన్’ చిత్రం ఈ నెల 19 నుంచి తెలుగు, తమిళ్‌లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ‘అన్నాత్తా’ చిత్రంలో కీర్తి ఆయనకు కూతురుగా నటిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. అలాగే, కీర్తి చేతిలో ప్రస్తుతం ‘రంగ్ దే’ , ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖి’, ‘మరక్కార్’ చిత్రాలు ఉన్నాయి.