యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్ రగిలిపోతోంది. కొంత మంది బాలీవుడ్ పెద్దల నెపోటిజం (బంధుప్రీతి) కారణంగానే సుశాంత్ బలవన్మరణానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు సుశాంత్‌కు అవకాశాలు రాకుండా అడ్డు పడ్డారని పరిశ్రమకు చెందిన వ్యక్తులతో పాటు అభిమానులు ఆరోపిస్తున్నారు. కొందరు డైరెక్టర్లు, నిర్మాణ సంస్థల వైఖరి వల్ల సుశాంత్ పలు సందర్భాల్లో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు వార్తలు వచ్చాయి. అతని ఆత్మహత్యకు ఇదే ప్రధాన కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ ‘దబాంగ్’ దర్శకుడు అభినవ్ కశ్యప్.. ఆ చిత్ర హీరో సల్మాన్ ఖాన్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. సల్మాన్, అతని కుటుంబ సభ్యులు తన జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించడం సంచలనం సృష్టించింది.
‘నా శత్రువులు తెలివైనవాళ్లు. నా వెనక నుంచి నాపై దాడి చేస్తారు. కానీ పదేళ్ల తర్వాత నా శత్రువులు ఎవరో నేను తెలుసుకోగలిగాను. వాళ్లెవరంటే సలీం ఖాన్ ( సల్మాన్ ఖాన్ తండ్రి), సల్మాన్ ఖాన్, సల్మాన్ సోదరులు అర్భాజ్ ఖాన్, సొహైల్ ఖాన్. డబ్బు, రాజకీయ పలుకుబడి, అండర్ వరల్డ్ కనెక్షన్లతో వాళ్లు ఎవరినైనా ఏమైనా చేయగలుగుతారు. కానీ, నేను సుశాంత్ మాదిరిగా తనువు చాలించను. తలవంచను. ఎదురొడ్డి పోరాడతా. అయితే..వాళ్ల అంతం చూస్తా.. లేకపోతే నా అంతం అయినా చూస్తా. పోరాడే సమయం వచ్చింది’ అని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దాంతో, బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీరంగంలో అడుగుపెట్టిన సుశాంత్ తదితరులకు బాలీవుడ్ పెద్దల నుంచి సరైన ప్రోత్సాహం లేకపోగా… ప్రతిభ ఉన్నా వాళ్లు ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ‘బాయ్‌కాట్ బాలీవుడ్’, ‘బాయ్‌కాట్ సల్మాన్’ హాష్ట్యాగ్స్‌తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
బాలీవుడ్‌లోని అగ్ర నిర్మాతలు, దర్శకులు అందరూ వారసత్వ నటులకే ఆఫర్లు ఇస్తున్నారని, అవార్డు వేడుకల్లో సైతం వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి వారిని అన్‌ఫాలో చేయాలని, వారి సినిమాలను నిషేధించాలంటూ పెడుతున్న పోస్టులకు స్పందన లభిస్తోంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియాల్లో సదరు నటీనటులు, దర్శక నిర్మాతలను అన్‌ఫాలో చేస్తున్నారు. వారిలో ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జొహార్, ఆలియా భట్, కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అలాగే, సుశాంత్‌కు అవకాశాలు ఇవ్వని యశ్ రాజ్, ధర్మ ప్రొడక్షన్స్ వంటి ఏడు నిర్మాణ సంస్థలపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ‘మీటూ’ ఉద్యమం మాదిరిగా.. బాలీవుడ్‌లో బాయ్‌కాట్ ట్రెండ్ కూడా ఉద్యమంగా మారేలా ఉంది.