Kayadu Lohar Liquor Scam : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్నట్టు.. కాస్త ఫేమ్ రాగానే.. సినిమా తారలు రెచ్చిపోతున్నారు. బెట్టింగ్ యాప్స్.. చీకటి వ్యాపారాల ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో ప్రముఖ యువ నేటి కయాదు లోహర్ కూడా చేరినట్టు తెలుస్తోంది. ఇటీవల ఈమె నటించిన డ్రాగన్ సినిమా విజయవంతమైంది. డ్రాగన్ సినిమా ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. గతంలో శ్రీ విష్ణు తో ఓ సినిమాలో నటించినప్పటికీ అది ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయింది. డ్రాగన్ సినిమా ద్వారా ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కయాదు లోహర్. ఆ తర్వాత ఈమెకు వరుసగా ఆఫర్లు రావడం మొదలైంది.. ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈమెకు సంబంధించిన ఒక విషయం జాతీయ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. లిక్కర్ స్కామ్ లో ఈమె పేరు వినిపించడం కలకలం రేపుతోంది.
Also Read : పాపిష్టి డబ్బుల కోసం.. పాములను కూడా వదల్లేదు..అందులోనూ స్కామేనా?
తమిళనాడులో లిక్కర్ స్కాం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కయాదు లోహర్ పేరు వినిపించడం సంచలనం రేపుతోంది. లిక్కర్ స్కామ్ లో ఆమె ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. లిక్కర్ స్కాం నిందితులు ఏర్పాటుచేసిన హై ప్రొఫైల్ నైట్ పార్టీలో కయాదు లోహర్ పాల్గొన్నారని అధికారులు చెబుతున్నారు. దీనికోసం ఆమె 35 లక్షల వరకు తీసుకుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే తమిళనాడు రాజకీయాలను ఈ వ్యవహారం షేక్ చేస్తోంది. అయితే ఇందులో ఇప్పటికే చాలామంది నేతలు అరెస్టు అయ్యారు.. పైగా ఈ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఎంట్రీ ఇచ్చాయి. భారీగా డబ్బులు చేతులు మారాయని.. ఇందులో హవాలా వ్యవహారం కూడా సాగిందని గుర్తించాయి. గత కొద్దిరోజులుగా తమిళనాడులో ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు విచారణ సాగిస్తున్నారు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు ఇచ్చారు.. ఆ తర్వాత అది ఏ రూపంలోకి వెళ్లిపోయింది.. హవాలా ద్వారా వచ్చిన డబ్బును ఎలా స్వీకరించారు.. అనే కోణాలలో అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు.
కయాదు లోహర్ పేరు తమిళనాడు లిక్కర్ స్కాంలో వినిపించడంతో ఒక్కసారిగా సంచలనం నెలకొంది. హై ప్రొఫైల్ పార్టీకి కయాదు లోహర్ ను ఎవరు పిలిచారు? ఆమెకు డబ్బులు ఏ రూపంలో చెల్లించారు? ఈ పార్టీని ఎక్కడ నిర్వహించారు? ఈ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు? ఇందులో అధికార డిఎంకెతో ఎంతమందికి సంబంధాలు ఉన్నాయి? వారు ఏమైనా లంచాలు ఇచ్చారా? ఒకవేళ లంచాలు ఇస్తే ఏ రూపంలో ఇచ్చారు? కయాదు లోహర్ కు 35 లక్షల ఏ రూపంలో చెల్లించారు? ఒక్కరోజు హై ప్రొఫైల్ పార్టీకి హాజరైనందుకు ఆమెకు ఆ స్థాయిలో ఇచ్చినప్పుడు.. మిగతా వాళ్లకు ఏ స్థాయిలో ఇచ్చి ఉంటారు? ఇందులో ఎవరైనా సినీ నటులు పాల్గొన్నారా? ఇంకా ఎవరైనా కార్పొరేట్ వ్యక్తులు ఉన్నారా? అనే కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారం తమిళనాడు చిత్ర పరిశ్రమకు చుట్టుకోవడంతో.. ఇందులోనూ చాలా పెద్ద తలకాయలే లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నట్టు ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది.