Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మన మధ్య లేరు అనే వార్తను ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఇంకా జీర్ణించుకో లేకపోతున్నారు. ఆయన అక్టోబర్ 29 న హఠాన్మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే. పునీత్ లేని లోటు కేవలం కర్ణాటక లోని నటులకే కాక సినీ ఇండస్ట్రి లోని అందరికీ తీరని లోటు అని చెప్పాలి. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ… తనదైన శైలిలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు పునీత్. చిన్న వయసులోనే తమ అభిమాన హీరో చనిపోయాడంటే ఇప్పటికీ ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు.
పునీత్ మృతి చెంది రెండు వారాలు పూర్తి కావోస్తున్న ఇప్పటికీ ఆయన సమాధి వద్దకు వేలాదిగా అభిమానులు తరలివస్తున్నారు. సమాధి వద్దే పెళ్లి చేసుకుంటామని ప్రేమ జంటలు చెబుతున్నాయంటే పునీత్ రాజ్ కుమార్ పై ఉన్న అభిమానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తన నటనతో కాక సామాజిక సేవా కార్యక్రమాల ద్వాారా తన గొప్ప దాత్రుత్వ గుణాన్ని చాటుకున్నాడు పునీత్. అయితే బెంగుళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో పునీత్ నమన అనే పేరుతో సంస్మరణ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, శాండల్ వుడ్ ఫిల్మ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ అసోసియేషన్స్ కలిసి ఈ సభను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శాండల్ వుడ్ సినీ నటులతో పాటు, ఇతర రాష్ట్రాల సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. కర్ణాటక సీఎంతో పాటు మాజీ సీఎం యడియూరప్ప, మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్న ముఖ్యమంత్రి బసవరాజు మాట్లాడుతూ.. పునీత్ రాజ్ కుమార్కు కర్ణాటక రత్న అవార్డు ఇవ్వనున్నట్లుగా తెలిపారు. అనంతరం పునీత్ రాజ్ కుమార్ కర్ణాటకకు చేసిన సేవల్ని పలువురు కొనియాడారు.