Kamal Haasan- Rajinikanth: దక్షిణాదిలో రజనీకాంత్, కమల్ హాసన్ తిరుగులేని నటులు. ఎంతో స్టార్ డం ఉన్నప్పటికీ.. ఇప్పటికీ ఆ హిప్పోక్రసీ ఛాయలు తన దగ్గరికి రానివ్వరు. ఇద్దరూ ఏడుపదులకు దగ్గరపడినా కాలా, కబాలి, విక్రమ్ లాంటి సినిమాలు చేస్తున్నారు అటువంటి నటులకు మణిరత్నం తన సినిమాలో అవకాశం ఇవ్వలేదు. ఔను.. మీరు చదువుతున్నది నిజమే. ఈ విషయాన్ని ఆ నటులే వెల్లడించారు.

జయలలిత, ఎంజీఆర్ చెప్పారు
తమిళనాడులో పొన్నియన్ సెల్వన్ అనే నవల బాగా ఫేమస్. ఆ నవలలో నందిని పాత్ర ఆధారంగానే నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రను రూపొందించారు. వాస్తవానికి పోనియన్ సెల్వన్ అనే నవలలో చాళుక్యుల ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. చాళుక్యులు దక్షిణాది ప్రాంతాన్ని పాలించారు కాబట్టి ఈ ప్రాంతంతో అవినాభావ సంబంధం ఎక్కువగా ఉంటుంది. అందుకే కాబోలు తమిళులు ఈ నవలను అమితంగా ఇష్టపడుతుంటారు. ఇన్నాళ్లు ఈ నవల ఆధారంగా సినిమా తీయాలని చాలామంది అనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. సుప్రసిద్ధ తమిళ నటుడు ఎంజీఆర్ ఈ పొన్నియన్ సెల్వన్ నవల గురించి పలుమార్లు కమలహాసన్ వద్ద ప్రస్తావించారు. దీంతో ఆయన ఈ నవల చదివారు. యాదృచ్ఛికంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా ఈ నవల విషయాన్ని సుప్రసిద్ధ తమిళ నటుడు రజనీకాంత్ వద్ద ప్రస్తావించారు. దీంతో ఆయన కూడా ఈ నవల చదివారు. అయితే ఈ నవల చదివినప్పుడు వంతియాతివన్ పాత్రకు తాను బాగా సరిపోతానని అప్పట్లో జయలలిత అనేవారని రజనీకాంత్ వెల్లడించారు. ఒకవేళ పొన్నియన్ సెల్వన్ నవల సినిమాగా రూపొందితే తానూ, కమల్ హాసన్, విజయ్ కాంత్, శ్రీదేవి ముఖ్యపాత్రలుగా నటించేవారమని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో చిన్న పాత్ర అయినా ఇవ్వమని మణిరత్నాన్ని అడిగితే ” నీ అభిమానులతో తిట్టిద్దామని అనుకుంటున్నావా” అని బదులు ఇచ్చారని వాపోయారు. తనకు ఉన్న స్టార్డం దృష్ట్యా ఇంకే దర్శకుడయినా వ్యాపార కోణంలో ఆలోచించి ఒప్పుకునే వారిని, కానీ మణిరత్నం అలా చేయలేదని ఆయన వివరించారు. మరోవైపు కమలహాసన్ కూడా ఇలాంటి అభిప్రాయాలనే వెల్లడించారు. పొన్నియన్ సెల్వన్ నవలను ఎంజీఆర్ చెప్తే తానూ చదివానని, అప్పట్లో తనను ఎంతగానో ఈ నవల ప్రభావితం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో ఆదిత్య కరికాలన్ పాత్రకు తాను బాగా నప్పుతానని అప్పట్లో ఎంజీఆర్ అనేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నవల ఆధారంగా తాను సినిమా నిర్మించే వాడినని, కాని కాలం కలిసి రాక ఆ అదృష్టం మణిరత్నాన్ని వరించిందని తెలిపారు. అయితే ఇందులో ఒక చిన్న పాత్ర తనకు ఇచ్చినా చేసేవాడినని కమలహాసన్ అన్నారు. కానీ మణిరత్నం సినిమా విషయంలో రాజీ పడబోరని ఆయన వెల్లడించారు.

30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల
మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ పోన్నియన్ సెల్వన్ రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. మొదటి భాగం ఈనెల 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బుధవారం చెన్నైలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కమలహాసన్, రజనీకాంత్ ముఖ్య అతిథిలుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారి వారి అభిప్రాయాలను, నవల తమను ప్రేరేపించిన అనుభవాలను వెల్లడించారు. కాగా ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. చాలా ఏళ్లుగా ఫ్లాప్ లతో బాధపడుతున్న మణిరత్నం ఈ సినిమాని ఎంతో గొప్పగా చిత్రీకరించారు. తమిళంలో పేరున్న నవల కావడంతో దక్షిణాది ప్రేక్షకులకు సులభంగానే చేరువ అవుతుందని చిత్ర నిర్మాణ సంస్థ అభిప్రాయపడుతోంది.