Kalki Collections: ఎట్టకేలకు ప్రభాస్ క్లీన్ హిట్ కొట్టాడు కల్కి 2829 AD చిత్రం. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ హ్యాట్రిక్ ప్లాప్స్ నమోదు చేశాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సాహో నిరాశపరిచింది. రాధే శ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్స్ అయ్యాయి. ఇక నాలుగో చిత్రం సలార్ సైతం పూర్తి స్థాయిలో మెప్పించలేదు. వరల్డ్ వైడ్ సలార్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ప్రచారం చేశారు. అవన్నీ ఫేక్ ఫిగర్స్ అన్నమాట వినిపించింది. ప్రభాస్ తో పాటు ఆయన ఫ్యాన్స్ దాహం తీర్చింది కల్కి. అన్ని భాషల్లో కల్కి చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది.
యూఎస్ లో కల్కి విడుదలకు ముందు రికార్డ్స్ నెలకొల్పింది. ప్రీమియర్స్ ద్వారానే $3.5 మిలియన్ కి పైగా రాబట్టి రికార్డులకు ఎక్కింది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కల్కి భారీ వసూళ్లు రాబడుతుంది. ముఖ్యంగా A సెంటర్స్ లో రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. B, C ఏరియాల్లో పర్లేదు. రెండో రోజు కల్కి చిత్ర వసూళ్లు పరిశీలిస్తే… తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరల్డ్ వైడ్ రెండవ రోజు కల్కి రూ. 40 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ. 134 కోట్ల షేర్, రూ. 260 కోట్ల గ్రాస్ రాబట్టింది.
వీకెండ్ మరో రెండు రోజులు ఉన్న నేపథ్యంలో కల్కి కి బాగా కలిసి రానుంది. కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. నైజాం లో రూ. 65 కోట్లు, సీడెడ్ లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో రూ. 76 కోట్ల బిజినెస్ చేసింది. కర్ణాటక రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, హిందీ కలిపి రూ. 85 కోట్లకు అమ్మారు. కేరళ హక్కులు రూ. 6 కోట్లకు, ఓవర్సీస్ రూ. 70 కోట్లకు విక్రయించారు. మొత్తంగా కల్కి రూ. 370 కోట్ల వరల్డ్ వైడ్ బిజినెస్ చేసింది.
మరో రూ. 236 కోట్ల షేర్ రాబడితే కల్కి బ్రేక్ ఈవెన్ అవుతుంది. వీకెండ్ ముగిసే నాటికి కల్కి 50 శాతం వరకు రికవరీ సాధించే అవకాశం ఉంది. మరి చూడాలి పూర్తి రన్ లో కల్కి ఎన్ని రికార్డులు నెలకొల్పనుందో. కల్కి చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు కాగా అశ్వినీ దత్ రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన వంటి నటులు కీలక రోల్స్ చేశారు . జూన్ 27న వరల్డ్ వైడ్ విడుదల చేశారు.