సోషల్ మీడియాలో జనాలు పోస్టులు చేయడం సహజం.. వాటికి కామెంట్లు.. రిప్లేలు పెట్టడం కూడా కామనే. కానీ.. కామెంట్ చేసినప్పుడు పోస్టు చేసినవారు గమనించకపోవడం.. చాలా కాలం తర్వాత చూసి.. అరెరెరే.. గమనించలేకపోయానే అని నాలుక్కరుచుకొని రిప్లే ఇవ్వడం కూడా చేస్తుంటారు కొందరు. అయితే.. సాధారణ జనాలు.. సాధారణ విషయాల్లో అయితే.. ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. కానీ.. సెలబ్రిటీలు.. ప్రముఖమైన విషయాలు అయితే మాత్రం.. అదో న్యూస్ కూడా అవుతుంది. ఇప్పుడు హీరోయిన్ కాజల్ విషయంలో ఇదే జరిగింది.
గౌతమ్ కిచ్లును గతేడాది అక్టోబర్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది కాజల్. ఆ తర్వాత ఎవ్రీ డే ను జాలీడేగా ఎంజాయ్ చేస్తోంది. కాజల్ సంసార జీవితంలోకి అడుగు పెట్టడంతో సహచరులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షల్లో ముంచెత్తారు. అప్పట్లో ఈ అమ్మడి పెళ్లి వార్తలు దాదాపు వారంపాటు సీరియల్ గానే సాగాయి. అందరూ గ్రీటింగ్స్ చెప్పడం.. వాళ్లు ధన్యవాదాలు చెప్పడం కూడా అయిపోయాయి. కానీ.. ఒక్కరికి మాత్రం బాకీ పడిపోయింది చందమామ.
కాజల్ పెళ్లి చేసుకున్న నెక్స్ట్ డే ట్విటర్ లో ఓ పోస్టు చేసింది స్వీటీ అనుష్క. వైవాహిక జీవితానికి సంబంధించిన పెద్ద కొటేషన్ రాసిమరీ.. కాజల్ కు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు.. ఈ పోస్టుకు కాజల్ ను కూడా ట్యాగ్ చేసింది. అయితే.. ఆ పోస్టుకు లైక్ కొట్టడమో.. రిప్లే ఇవ్వడమో కూడా చేయలేదు కాజల్. పెళ్లయిన దాదాపు 7 నెలల తర్వాత కాజల్ రిప్లే ఇవ్వడం విశేషం. లవ్ సింబ్ పెట్టి, థాంక్స్ చెప్పింది.
ఇక, నెటిజన్లు ఎందుకు ఆగుతారు..? అమ్మడిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. రిటైర్మెంట్ లేకుండా సెటైర్లు దూసుకొస్తున్నాయి. ‘ఇప్పుడే ఎందుకు రిప్లే ఇచ్చావమ్మా.. పిల్లలు పుట్టిన తర్వాత ఇస్తే బాగుండేది కదా’ అంటున్నారు కొందరు. ‘ఓ ఐదు మాసాలు అయితే.. మ్యారేజ్ డే వస్తుంది కదా.. అప్పుడు చెప్తే బాగుండేది’ అంటున్నారు ఇంకొందరు.
మరికొందరు మాత్రం ‘ఫోన్ చేసి కృతజ్ఞతలు చెబితే పోయేది గౌరవంగా ఉండేది కదా.. ఇంత కాలం తర్వాత ఇలా రిప్లే ఇవ్వడం ఏమీ బాగలేద’ని అంటున్నారు ఇంకొందరు. నిజమే కదా.. చూసుకోలేదనో, ఇంకా వేరే కారణం ఏమైనా ఉంటే అది చెప్పో.. థాంక్స్ చెబితే బాగుండేది. మరీ.. ఇన్నాళ్ల తర్వాత ఏదో ఫార్మాలిటీ రిప్లే ఇవ్వడం బాగోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.